
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ హవా కొనసాగుతోంది. ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 40-24తో యు ముంబాను చిత్తు చేసింది. ఈ విజయంతో అతిథ్య ఢిల్లీ టాప్‌ప్లేస్‌ను ఆక్రమించింది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ (11).. డిఫెండర్లు రవిందర పహాల్ (8), జోగిందర్ నర్వాల్ (6) సత్తాచాటారు. ముంబా తరపున అర్జున్ దేశ్వాల్ (7), సందీప్ నర్వాల్ (6) ఆకట్టుకున్నా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.
మ్యాచ్ ఆరంభంలో యు ముంబా డిఫెండర్లు ఆకట్టుకోవడంతో ఆ జట్టు 4-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ రెండు వరుస పాయింట్లు తేవడం, పహాల్ ట్యాకిల్ పాయింట్లు చేయడంతో ముంబా ఆలౌట్ అయింది. ఈ సమయంలో ఇరు జట్లు పాయింట్ల కోసం పోరాడాయి. దీంతో ఢిల్లీ 14-11తో స్వల్ప ఆధిక్యంతో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. విరామం తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన ఢిల్లీ.. మరోసారి ముంబాను ఆలౌట్ చేసింది. దీంతో యూ ముంబాకు ఘోరపరాభవం తప్పలేదు. ఈ విజయంతో దబాంగ్ ఢిల్లీ వివో ప్రో కబడ్డీ సీజన్ 7లో సొంత గడ్డపై మూడు విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా నిలిచింది.
బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో హరియాణా 41-25 తేడాతో గుజరాత్ ఫార్చ్యూన్‌జెయింట్స్‌ను ఓడించింది. దీంతో హరియాణా విజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. హరియాణా ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటారు. రైడింగ్‌లో వికాస్ ఖండోలా (7), ప్రశాంత్ కుమార్ రాయ్ (8).. ట్యాక్లింగ్‌లో రవి కుమార్ (6) రాణించి హరియాణాకు అద్భుత విజయాన్ని అందించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదగొట్టిన హరియాణా పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.