
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్‌కు సొంతగడ్డపై చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చ్యూన్‌జెయింట్స్ 32-23 స్కోరు తేడాతో బుల్స్‌ను ఓడించింది. రైడింగ్‌లో సచిన్ ఐదు పాయింట్లు సాధించడంతో పాటు డిఫెన్స్‌లో ఆటగాళ్లంతా సత్తాచాటడంతో గుజరాత్ సునాయాస విజయాన్ని అందుకుంది. సచిన్, జీబీ మోరే చెరో 5 పాయింట్లు సాధించారు. బెంగళూరు జట్టులో సౌరభ్ (8 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) రాణించారు.
మ్యాచ్ ఆరంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. పాయింట్ల కోసం ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడడంతో ఆధిక్యం మారుతూ వచ్చింది. 11 నిమిషాలు ముగిసేసరికి ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. రోహిత్ గుళియా, పర్వేశ్ సత్తా చాటడంతో బుల్స్‌ను ఆలౌట్ చేసిన గుజరాత్ 14-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో 18-12తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది.
విరామం తర్వాత బుల్స్ రైడర్లు పుంజుకున్నారు. దీంతో 20-22తో గుజరాత్ స్కోరును సమీపించింది. ఈ సమయంలో గుజరాత్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మోరే, సచిన్ రాణించడంతో మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 23-27తో ఆధిక్యంలో నిలిచి మ్యాచ్ సొంతం చేసుకుంది. స్టార్ రైడర్ పవన్ విగలమవడంతో బుల్స్ ఓటమిని చవిచూసింది. ఈ పోరుకు ముందు ఎనిమిది మ్యాచుల్లో ఏడు ఓటములతో ఉన్న గుజరాత్ ఈ విజయంతో ఊరట చెందింది. అంతేగాకుండా పాయింట్ల పట్టికలోనూ ముందంజ వేస్తూ ఆరోస్థానానికి దూసుకెళ్లింది.