
న్యూఢిల్లీ: పీకేఎల్ సీజన్-7లో డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బెంగళూరు స్టార్ రైడర్ రోహిత్ కుమార్ సూపర్-10 సాధించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 41-30 తేడాతో జైపుర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. రోహిత్ కుమార్‌కి తోడు పవన్ సెరావత్ (8).. ట్యాక్లింగ్‌లో మహేందర్ సింగ్ (6), మోహిత్ (5), సౌరభ్ (5)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఆట ఆరంభం నుంచే రైడర్లు రోహిత్, పవన్ వరుస పాయింట్లు తేవడంతో తొమ్మిది నిమిషాలకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన బుల్స్ 13-4తో ఆధిక్యం సంపాదించింది. మరోవైపు బుల్స్ డిఫెండర్లు కూడా సత్తా చాటడంతో 22-8తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండు అర్ధ భాగంలో కూడా జైపుర్‌ను మరోసారి ఆలౌట్ చేసి 27-10తో నిలిచింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో దూసుకెళ్లిన బుల్స్ మరో నాలుగు నిమిషాల్లో ఆట మ్యాచ్ ముగుస్తుందనగా 40-26తో విజయం ఖాయం చేసుకుంది.
అయితే చివరలో జైపూర్ ఆటగాళ్లు సత్తా చాటారు. పవార్, దీపక్ పోరాట పటిమ చూపడంతో జైపూర్ 11 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. జైపుర్ తరపున నితిన్ రావల్ (8), అజింక్య పవార్ (5) ఆకట్టుకున్నారు. రైడింగ్‌లో రోహిత్ కుమార్ (13), పవన్ సెరావత్ (8) ఫామ్ కొనసాగించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో జైపూర్ రెండో స్థానానికి చేరింది.