
చెన్నై: సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ పరాజయం పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 21-32తో డిఫెండింగ్ చాంప్ బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. మ్యాచ్ ఆరంభం నుంచే రైడర్ పవన్ షెరావత్ (11) అదరగొట్టడంతో బుల్స్ సునాయాస విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ ఆరంభం నుంచే పవన్ విజృంభించడంతో బెంగళూరు బుల్స్ 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఖాతా తెరిచేందుకే నానా తంటాలు పడ్డ తలైవాస్.. బుల్స్ రైడర్ పవన్ షెరావత్ ధాటికి ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఆలౌటయ్యారు. దీంతో ఒక్కసారిగా బుల్స్ 10-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో తలైవాస్ రైడర్ మోహిత్ చిల్లార్ మెరుపు రైడ్లు చేయడంతో తమిళ్ జట్టు 17-19తో బెంగళూరును సమీపించింది.
బెంగళూరు మరోసారి ఊపును కొనసాగించి తలైవాస్‌ను అడ్డుకుంది. ఎప్పటికప్పుడు ఆధిక్యాన్ని నిలుపుకుంటూ వెళ్లిన బుల్స్.. తలైవాస్‌కు అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌పై ఆఖరిదాకా పట్టు వదలని బుల్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. 8 మ్యాచ్‌ల్లో 27 పాయింటతో బుల్స్ పట్టికలో రెండో స్థానానికి చేరింది. పవన్ షెరావత్ సూపర్ 'టెన్'తో జట్టుకు విజయాన్ని అందించాడు. సౌరభ్ నండల్ 5 టాకిలింగ్స్‌తో సత్తా చాటాడు. తలైవాస్ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదరి, మంజీత్ చిల్లర్, అజయ్ ఠాకూర్‌లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా రాహుల్ చౌదరి కేవలం 2 పాయింట్లే తేవడం తలైవా్‌సను దెబ్బకొట్టింది.