
కోల్‌కతా: డుబ్కీ కింగ్, స్టార్ రైడర్ పర్‌దీప్ నర్వాల్ అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్-7లో పట్నా పైరేట్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36-33తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలలో అట్టడుగు నుంచి 9వ స్థానానికి ఎగబాకిన పట్నా.. ప్లేఆప్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గత మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై గెలిచి ఫామ్‌లోకి వచ్చిన ఆ జట్టు జైపూర్‌పైనా సత్తాచాతింది.
మ్యాచ్ ఆరంభంలో పర్‌దీప్ వరుస పాయింట్లు తేవడం.. సందీప్ దుల్ టాకిల్స్ చేయడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. దీంతో ఇరు జట్ల ఆధిపత్యం మారుతూ వచ్చింది. ఇక తొలి అర్ధ భాగంలో 15-14తో జైపూర్ ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో పాట్నా రైడర్లు మంచి ప్రదర్శన చేయడంతో.. ఓ దశలో 23-24తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆట మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా 29-29తో స్కోర్ సమం అయింది.
స్టార్ రైడర్ నర్వాల్‌ను పింక్ పాంథర్స్ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా పట్టేసిన సమయంలో పాట్నా 33-32తో ఆధిక్యంలో ఉంది. చివరి నిమిషంలో లీ అద్భుతంగా ఆడి బోనస్ పాయింట్ సాధించడం, నీరజ్ కుమార్ తెలివైన ట్యాక్లింగ్‌తో పాట్నా మూడు పాయింట్ల తేడాతో గెలిచింది. పాట్నా కెప్టెన్ పర్‌దీప్ నర్వాల్ 14 రైడ్ పాయింట్లతో సత్తా చాటగా.. జంగ్ కున్‌లీ (8పాయింట్లు) రాణించాడు. జైపూర్ రైడర్ దీపక్ హుడా (5 పాయింట్లు) నిరాశపరిచాడు.
గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 42-40తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్టార్ రైడర్ పవన్ కుమార్ 19 రైడ్ పాయింట్లు చేసినా బుల్స్ విజయాన్ని అందుకోలేకపోయింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం.