
హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న తెలుగు టైటాన్స్ ఆఖరు నిమిషంలో మరో విజయాన్ని చేజార్చుకుంది. టైటాన్స్ అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. శుక్రవారం పట్నా పైరేట్స్, టైటాన్స్ మధ్య హోరాహోరీగా సాగిన పోరు చివరకు 42-42తో టైగా ముగిసింది.
స్పష్టమైన ఆధిక్యాన్ని రెండు సార్లు చేజార్చుకున్న టైటాన్స్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. తెలుగు టైటాన్స్ సిద్ధార్థ్ దేశాయ్ (12 పాయింట్లు), రజనీశ్ (10 పాయింట్లు) సూపర్-10లతో మెరిస్తే పాట్నా తరఫున డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ 17 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసి జట్టుని ఓటమి నుంచి తప్పించాడు.
ఏకంగా మూడు సూపర్ రైడ్‌లతో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. మరో నాలుగు నిమిషాల ఆట మిగిలి ఉందనగా 38-33 ఆధిక్యంలో నిలిచిన తెలుగు టైటాన్స్ ఆలౌటై విజయం ముంగిట బోల్తా పడింది. దీంతో చివరకు మ్యాచ్ టై అయింది. కీలక సమయాల్లో తడబడిన తెలుగు టైటాన్స్ మరోసారి మూల్యం చెల్లించుకుంది.
ప్రస్తుతం లీగ్‌లో 16 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 4 విజయాలు 9 పరాజయాలు 3 టైలతో 33 పాయింట్లతో పట్టికలో ఆఖరు నుంచి రెండో స్థానం(11వ)లో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 42-38తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది.
ప్రొ కబడ్డీలో శనివారం
జైపుర్ vs గుజరాత్ (రాత్రి 7:30 నుంచి)
యూపీ vs తలైవాస్ (రాత్రి 8:30 నుంచి)