
ముంబై: ప్రొ కబడ్డీ సీజన్-7లో జైపుర్ పింక్ పాంథర్స్ జైత్రయాత్ర కొనసాగిస్తూ విజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపుర్ 37-21తో హర్యానా స్టీలర్స్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. రైడింగ్‌లో జైపూర్ కెప్టెన్ దీపక్ హుడా (14), డిఫెండింగ్‌లో సందీప్ ధుల్ (6) మరోసారి మెరవడంతో జైపూర్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
దీపక్ హుడా మెరవడంతో తొలి మూడు నిమిషాలు ముగిసేసరికి జైపూర్ 5-1తో ఆధిక్యంలో వెళ్ళింది. ఈ సమయంలో హర్యానా ఆటగాళ్లు జోరు పెంచడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. రెండు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం పోటీపడడంతో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే తొలి అర్ధభాగాన్ని జైపుర్ 13-8తో ముగించింది. విరామం తర్వాత మరింత దూకుడుగా ఆడిన జైపూర్.. ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 17-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరు కొనసాగిస్తూ మరోసారి ఆలౌట్ చేసి 34-16తో విజయాన్ని ఖాయం చేసుకుంది. హర్యానా జట్టులో వినయ్ (6), సునీల్ (6) ఆకట్టుకున్నారు. జైపూర్ యజమానులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఆటగాళ్లను ఉత్సాహరుస్తూ సందడి చేశారు.
ఈ సీజన్‌లో యూపీ యోధ ఎట్టకేకలకు బోణీ కొట్టింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో యూపీ 27-23తో యు ముంబాపై గెలిచింది. రైడింగ్‌లో మోను గోయత్ (6), సుమిత్ (6) రాణించడంతో యూపీ తొలి విజయాన్ని నమోదు చేసింది. యు ముంబా తరపున రోహిత్ బలియాన్ (6), సురిందర్ సింగ్ (4) రాణించారు. మ్యాచ్ ఆరంభంలో రెండు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా తలపడడంతో స్కోర్లు సమమవుతూ వచ్చాయి. అయితే చివరి నిమిషాల్లో యూపీ రైడర్ మోను సత్తాచాటి జట్టుకు విజయాన్ని అందించాడు. గురువారం గుజరాత్‌తో డిల్లీ తలపడుతుంది.