
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో మాజీ ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ దూసుకుపోతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జైపూర్.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపుర్ పింక్ పాంథర్స్ 28-26తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. ఈ విజయంతో జైపూర్ తన ఆధిక్యాన్ని 7 పాయింట్లకు పెంచుకుంది. సొంత గడ్డపై తలైవాస్‌కు ఇది రెండో పరాజయం.
మ్యాచ్ ఆరంభంలో సందీప్ ధుల్ మరియు అమిత్ హూడా చెలరేగడంతో జైపూర్ 4 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో ఐస్ మాన్' అజయ్ ఠాకూర్, 'షోమాన్' రాహుల్ చౌదరి పాయింట్లు సాధించడంతో 6-6తో స్కోరును సమం చేశారు. దీపక్ నార్వాల్ మూడు బ్యాక్-టు-బ్యాక్ విజయవంతమైన రైడ్లు చేయడంతో జైపూర్ తొలి అర్ధభాగాన్ని 13-11తో ముగించింది. రెండవ అర్ధ భాగంలో జైపూర్ హవా కొనసాగించింది. దీపక్ హూడా రెండు రైడ్ పాయింట్లు తేవడం, అజయ్ ఠాకూర్‌ను పవన్ టిఆర్ సూపర్ టాకిల్ చేయడంతో జైపూర్ ఆధిక్యాన్ని పెంచుకుంది. ఈ సమయంలో రాహుల్ చౌదరి పాయింట్లు తేవడంతో తలైవాస్ పుంజుకుని స్కోర్ సమం చేసింది.
ఆట నాలుగు నిముషాలు ఉందనగా నీలేశ్ సాలుంకే వరుస రైడ్ పాయింట్లు సాధించడంతో జైపూర్ 25-22తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జైపూర్ విజయం సాధించింది. పాంథర్స్ తరఫున రైడింగ్‌లో నీలేశ్ సాలుంకే (7), డిఫెన్స్‌లో విశాల్ (4) రాణించారు. తలైవాస్ జట్టులో రాహుల్ చౌదరీ (6), వినీత్ శర్మ (3) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ 31-23తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. ఈ రోజు బంగాల్‌తో పట్నా తలపడనుంది.