
ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్-7లో దబాంగ్ ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం యూపీ యోధాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 36-27 స్కోరుతో విజయం సాధించింది. ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ (16 పాయింట్ల) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవీందర్ పహల్ హై 5ను నమోదు చేశాడు. యూపీ తరపున మోను గోయత్ సూపర్-10 సాధించినా ఫలితం లేకపోయింది.
యూపీ యోధ ఆట ఆరంభంలోనే 4-0 ఆధిక్యం సాధించింది. కానీ నవీన్ రెండు రైడ్ పాయింట్లు తేవడంతో ఢిల్లీ పుంజుకుంది. నవీన్, పహల్ పాయింట్లు సాధించడంతో మొదటి అర్ధభాగంలో ఢిల్లీ దూసుకుపోయింది. మొదటి అర్ధభాగం రెండు నిమిషాల్లో ముగుస్తుండగా.. యూపీ ఆలౌట్ కావడంతో 15-11తో ఢిల్లీ ఆధిక్యంలో నిలిచింది. విరామం అనంతరం నవీన్ వరుస రైడ్లతో విరుచుకుపడడంతో ఢిల్లీ భారీ అధిక్యంలో నిలిచింది. మద్యలో యూపీ పుంజుకున్నా.. ఢిల్లీ అవకాశం ఇవ్వలేదు. దీంతో సొంత గడ్డపై ఢిల్లీ రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
పీకేఎల్ సీజన్-7లో డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బెంగళూరు స్టార్ రైడర్ రోహిత్ కుమార్ సూపర్-10 సాధించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 41-30 తేడాతో జైపుర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. రోహిత్ కుమార్‌కి తోడు పవన్ సెరావత్ (8).. ట్యాక్లింగ్‌లో మహేందర్ సింగ్ (6), మోహిత్ (5), సౌరభ్ (5)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సోమవారం బంగాల్ వారియర్స్ × హరియాణా స్టీలర్స్, యూపీ యోధ × పుణెరి పల్టాన్ జట్లు తలపడనున్నాయి.