
న్యూఢిల్లీ: సొంత గడ్డపై దబంగ్ ఢిల్లీ విజయం సాధించింది. శనివారం త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చివరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఆతిథ్య ఢిల్లీ 33-31తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఢిల్లీ తరపున స్టార్ రైడర్ నవీన్ కుమార్ 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుల్స్ ఆటగాడు పవన్ శెరావత్ 17 పాయింట్లు సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు.
బెంగళూరు బుల్స్ మ్యాచ్‌ను అద్భుతంగా ఆరంబించింది. పవన్ నాలుగు రైడ్ పాయింట్లు సాధించడంతో మూడవ నిమిషంలోనే 5-0 ఆధిక్యాన్ని సాధించింది. ఢిల్లీ నాలుగవ నిమిషంలో మొదటి పాయింట్‌ను సాధించింది. పవన్ జోరు కొనసాగించడంతో 11వ నిమిషంలో ఢిల్లీ ఆల్అవుట్ అయి 12-6తో వెనుకపడింది. నవీన్ పుంజుకోవడంతో ఒక దశలో బుల్స్ ఆధిక్యాన్ని ఢిల్లీ ఐదు పాయింట్లకు తగ్గించింది. అయితే పవన్ సత్తాచాటడంతో మొదటి అర్ధ భాగాన్ని బుల్స్ 19-11తో ముగించింది.
రెండవ భాగంలో ఢిల్లీ వరుసగా మూడు పాయింట్లు సాధించి రేసులో నిలిచింది. అయితే పవన్ ఫామ్ కొనసాగించడంతో బుల్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట నాలుగు నిముషాలు ఉందనగా.. నవీన్ నాలుగు పాయింట్లు తేవడంతో బుల్స్ కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలో నిలిచింది. చివరి నిమిషంకు ముందు స్కోర్ 31-31తో సమం అయింది. చివరలో నవీన్ రైడ్ పాయింట్ తేవడం, పవన్ ఔట్ అవ్వడంతో ఢిల్లీ విజయం సాధించింది. శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన మరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 24-21తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్.. యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి.