
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో జైపుర్ పింక్‌పాంథర్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న జైపుర్‌ను దబంగ్ ఢిల్లీ అడ్డుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 35-24తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. లీగ్ ఆరంభం నుంచి వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన జైపూర్‌కు ఇదే తొలి ఓటమి. రైడింగ్‌లో నవీన్ కుమార్ (12), చంద్రన్ రంజిత్ (10) సూపర్-10లు సాధించి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. రవీంద్ర పహల్ 3 టాకిలింగ్ పాయింట్లు చేసాడు.
ఆట ఆరంభంలో దీపక్ హుడా (10), దీపక్ నర్వాల్ (5) చెలరేగడంతో ఆరు నిమిషాలు ముగిసేసరికి జైపుర్ 7-4తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సమయంలో చంద్రన్ రంజిత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో పుంజుకున్న డిల్లీ 9-9తో స్కోరు సమం చేసింది. మరోవైపు నవీన్ కూడా దూకుడు పెంచడంతో జైపుర్‌ను తొలిసారి ఆలౌట్ చేసిన డిల్లీ 16-10తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది.
విరామం తర్వాత కూడా డిల్లీ ఆటగాళ్లు అదే కొనసాగించారు. వరుసగా పాయింట్లు తేవడంతో జైపుర్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో మరోసారి జైపుర్‌ను ఆలౌట్ చేసిన డిల్లీ 29-17తో భారీ ఆధిక్యం సాధించింది. మరోవైపు జైపూర్ పేలవ ప్రదర్శన చేయడంతో.. చివరి వరకు ఆధిక్యాన్ని అలానే కొనసాగించిన ఢిల్లీ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన డిల్లీ.. 21 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
సోమవారమే ఉత్కంఠ భరితంగా జరిగిన మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 33-31తో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆలస్యంగా పుంజుకున్న పల్టాన్‌కు ఇది వరుసగా రెండో విజయం. రైడింగ్‌లో పవన్ కడియాన్ (6), అమిత్ కుమార్ (5).. ట్యాక్లింగ్‌లో గిరీశ్ ఎర్నాక్ (6), మంజీత్ చిల్లార్ (4) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. గుజరాత్ రైడర్లు సచిన్ (9), రోహిత్ (6) పర్వాలేదనింపించారు.