
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ హవా కొనసాగుతోంది. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ 29-26తో మాజీ ఛాంపియన్ యు ముంబా పై విజయం సాధించింది. వారియర్స్ తరఫున సుఖేశ్ హెగ్డే 8, మణిందర్ 7 పాయింట్లు సాధించారు. ముంబా తరపున అర్జున్ దేశ్వాల్ (15 పాయింట్లు) సూపర్-10తో మెరిసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.
ఆట మొదటి నిమిషంలోనే అర్జున్ సూపర్ రైడ్ ద్వారా 3 పాయింట్లు సాధించడంతో ముంబై జట్టు శుభారంభం వేసింది. కాసేపటికే తేరుకున్న బెంగాల్ కూడా ఖాతా తెరిచి 3-3తో స్కోరు సమం చేసింది. ఆరంభంలో రెండు జట్లు పాయింట్ల కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయితే జోరు పెంచిన బెంగాల్.. వరుస పాయింట్లు సాధించి ముంబాను ఆలౌట్ చేయడంతో 16-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో తిరిగి పుంజుకున్న యు ముంబా మొదటి అర్ధ భాగాన్ని 16-13తో ముగించింది.
రెండో అర్ధ భాగంలో కూడా బెంగాల్ ఆటగాళ్లు రెచ్చిపోవడంతో ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇదే దశలో అర్జున్ పోరాటపటిమ కనబరచడంతో ముంబా తేరుకుని బెంగాల్ స్కోరుకు దగ్గరగా వచ్చింది. ఇక మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. ముంబా కేవలం ఒక పాయింట్ మాత్రమే వెనుకంజలో ఉంది. అప్పటి వరకు ఆకట్టుకున్న అర్జున్ ప్రత్యర్థి కోర్టులో సూపర్ ట్యాకిల్ కావడంతో యు ముంబాకు ఓటమి తప్పలేదు.
అర్జున్ విజృంభణతో రైడింగ్‌లో ముందంజలో నిలిచిన యు ముంబా.. ట్యాక్లింగ్‌లో వెనుకబడి మ్యాచ్‌ను కోల్పోయింది. ప్రస్తుతం లీగ్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన బెంగాల్ 8 విజయాలు, 4 పరాజయాలు, 3 డ్రాలతో 53 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలువగా.. 15 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములు ఒక డ్రాతో యు ముంబా (43 పాయింట్లు) పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది.