
బెంగళూరు: రైడర్ అభిషేక్ సింగ్ (13 పాయింట్లు), డిఫెండర్ ఫజల్ అత్రాచలి (6 పాయింట్లు) అద్భుత ప్రదర్శన చేయడంతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో యు ముంబా మరో విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 47-21తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో ముంబా ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ముంబా.. 6 మ్యాచ్‌ల్లో గెలిచి ఆరింటిలో ఓడిపోయింది.
మ్యాచ్ ఆరంభంలోనే ముంబా 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కొద్ది నిమిషాల తరువాత జైపూర్ ఆలౌట్ అవ్వడంతో యు ముంబా ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇదే ఊపులో ముంబా తొలి అర్ధ భాగం ముగిసేసరికి 16 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఏడో సీజన్‌లో ఇదే అతిపెద్ద ఆధిక్యం. ముంబా చివరివరకు అదే జోరు కొనసాగిస్తూ 26 పాయింట్లతో గెలుపొందింది. ప్రత్యర్థి కోర్టును షేక్ చేసిన అభిషేక్.. ముంబాకు ఏకపక్ష విజయాన్ని అందించగా.. అర్జున్, ఫజల్ చెరో 6 పాయింట్లతో అతడికి సహకరించారు. జైపూర్ ఆతరఫున నితీష్ (5), హుడా (3) పాయింట్లతో రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.
శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్‌కు సొంతగడ్డపై చుక్కెదురైంది. గుజరాత్ ఫార్చ్యూన్‌జెయింట్స్ 32-23 స్కోరు తేడాతో బుల్స్‌ను ఓడించింది. రైడింగ్‌లో సచిన్ ఐదు పాయింట్లు సాధించడంతో పాటు డిఫెన్స్‌లో ఆటగాళ్లంతా సత్తాచాటడంతో గుజరాత్ సునాయాస విజయాన్ని అందుకుంది. సచిన్, జీబీ మోరే చెరో 5 పాయింట్లు సాధించారు. బెంగళూరు జట్టులో సౌరభ్ (8 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) రాణించారు. నేడు యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్ ఆడతాయి.