హైదరాబాద్: ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ దూసుకుపోతుంది. ఆదివారం పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సబ్‌గా బరిలోకి దిగిన మహేంద్ర రాజ్‌పుత్ 6 పాయింట్లతో రాణించడంతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ 33-29తో విజయం సాధించింది.
గుజరాత్ విజయంలో మహేంద్ర రాజ్‌పుత్(6), ఫజల్ అత్రచలీ(5) కీలకపాత్ర పోషించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ట్యాకిల్ ద్వారా 15 పాయింట్లు సాధించింది. 12వ నిమిషంలో పట్నాను ఆలౌట్ చేసి 13-8 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన గుజరాత్ తొలి అర్ధభాగంలో 18-12తో పైచేయి సాధించింది.

ఇక, రెండో అర్ధభాగంలో పట్నా పుంజుకున్నప్పటికీ గుజరాత్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. ఈ మ్యాచ్ ద్వారా పట్నా స్టార్ ప్లేయర్ పర్‌దీప్‌నార్వల్ పీకేఎల్‌లో 500 రైడింగ్ పాయింట్లు నమోదు చేశాడు. తాజా విజయంతో జోన్-బిలో గుజరాత్ 20 మ్యాచ్‌ల్లో 77 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇక, పట్నా 67 పాయింట్లతో జోన్-బిలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 38-30తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. పుణెరి జట్టులో రాజేష్ మొండల్ 9 రైడ్ పాయింట్లతో, గిరీష్ 5 ట్యాకిల్ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.