మళ్లీ విజయం బాటలోకి.. పట్నాపైరేట్స్‌పై తెలుగు టైటాన్స్ విజయం!!

హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్-6లో తెలుగు టైటాన్స్ మళ్లీ గెలుపు బాట పట్టి మరో విజయం సాధించింది. గత మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన టైటాన్స్.. శుక్రవారం చక్కటి ప్రదర్శనతో డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్‌కు చెక్ పెట్టింది. జోన్-బిలో భాగంగా తెలుగు టైటాన్స్ 35-33తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. ఇరు జట్లలోని డిఫెండర్ల సత్తాకు వేదికగా నిలిచిందీ మ్యాచ్. విశాల్ భరద్వాజ్, అబోజర్ కలిపి 11 ట్యాకిల్ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

పట్నాకు వరుసగా ఇది రెండో ఓటమి
టైటాన్స్ జట్టులో రాహుల్ చౌదరి (7 పాయింట్లు), విశాల్ భరద్వాజ్ (6), నిలేష్ (5), అబోజర్ (5) రాణించారు. పట్నాకు వరుసగా ఇది రెండో ఓటమి. పైరేట్స్ జట్టులో మంజిత్ (8), విజయ్ (8), ప్రదీప్ (5) మెరిసినా ఓటమి తప్పలేదు. టైటాన్స్ 15 చొప్పున రైడ్, టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన టైటాన్స్ 4-0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత పట్నా 8-6, 14-9తో పుంజుకుంది.

విరామం తర్వాత పుంజుకున్న టైటాన్స్
అదే జోరుతో పైరెట్స్ 17-14తో బ్రేక్‌కు వెళ్లింది. విరామం తర్వాత పుంజుకున్న టైటాన్స్ 22-21, 26-21తో ముందంజ వేసింది. బోనస్ పాయింట్లకు తోడు ట్యాకిల్ పాయింట్‌తో 27వ నిమిషంలో ఆ జట్టు 22-21తో ఆధిక్యంలోకి వచ్చింది. తర్వాత ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. 33వ నిమిషానికి టైటాన్స్ 29-28తో నిలిచింది. ఒక దశలో స్కోరు 30-30తో సమం కావడంతో ఉత్కంఠ నెలకొంది. చివర్లో టైటాన్స్ రైడర్లు, డిఫెండర్లు ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్నందించారు.

పుణెరి పల్టాన్‌తో పింక్‌పాంథర్స్‌ను ఓడించి
మరో 3 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా టైటాన్స్ 5 పాయింట్లు సాధించి.. 35-33తో మ్యాచ్‌ను ముగించింది. పోటాపోటీగా సాగిన మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 29-25తో జైపుర్ పింక్‌పాంథర్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల డిఫెన్స్ బలంగా కనిపించింది. రవికుమార్ 6 ట్యాకిల్ పాయింట్లు, మోను 5 రైడ్ పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థి జట్టులో దీపక్ హుడా 5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు.

స్థిరంగా ఆధిక్యాన్ని కొనసాగించి
పుణెరి తరఫున మోను (7), రవి కుమార్ (6) రాణించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పుణెరి (20), యూ ముంబా (18) టాప్-2లో ఉన్నాయి. జోన్-బిలో తెలుగు టైటాన్స్ (16), పట్నా పైరేట్స్ (11) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రథమార్ధం ముగిసేసరికి 13-12తో ఆధిక్యంలో నిలిచిన పుణెరి.. ద్వితీయార్ధంలో కొంచెం దూకుడు పెంచింది. స్థిరంగా 4, 5 పాయింట్ల ఆధిక్యాన్ని కొనసాగించిన ఆ జట్టు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications