న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం నుంచి జరగనున్న కబడ్డీ ప్రపంచకప్ నుంచి పాక్ ఉద్వాసనకు గురైంది. ఈమేరకు పాకిస్థాన్ ఎంట్రీని తిరస్కరించినట్టు అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్) చీఫ్ దేవ్‌రాజ్ చతుర్వేది ధృవీకరించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
'ఐకేఎఫ్‌లో పాకిస్థాన్ కీలక సభ్య దేశమే. కానీ రెండు దేశాల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచకప్‌కు ఆ దేశ జట్టును దూరం పెట్టాలని నిర్ణయించాం. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో కబడ్డీ ఆడలేం' అని చతుర్వేది తెలిపారు.

కాగా, భారత్ సహా 12 దేశాలు పోటీపడనున్న కబడ్డీ ప్రపంచకప్ అహ్మదాబాద్‌లో శుక్రవారం ఆరంభమవుతుంది. అరంగేట్రం జట్టు అమెరికాతో ఇరాన్ ఆరంభ మ్యాచ్‌లో తలపడనుంది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియాను భారత్ ఢీకొననుంది.
కాగా, ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణ కొరియా, అర్జెంటీనా జట్లు గ్రూప్-ఎలో ఉండగా.. ఇరాన్, పోలెండ్, అమెరికా, కెన్యా, థాయిలాండ్, జపాన్ జట్టు గ్రూప్-బిలో ఆడనున్నాయి.
గ్రూప్‌లో ప్రతి జట్టూ మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 21న సెమీస్, 22న ఫైనల్ జరుగుతాయి.
తీవ్రంగా స్పందించిన పాక్
ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఇంగ్లాండ్, పోలాండ్, కెన్యా, అర్జెంటీనా వంటి టాప్ జట్లు పాల్గొంటున్న ఈవెంట్ నుంచి టైటిల్ ఫేవరెట్‌గా భావిస్తున్న పాక్‌ను తప్పించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే, భద్రతా సమస్యలే కారణాలైతే భారత్‌ను కూడా టోర్నీ నుంచి తప్పించాలని ఐకేఎఫ్‌పై పాక్ నిప్పులు చెరిగింది. తమ దేశ జట్టును టోర్నీ నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేసింది. ఇతర పోటీలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది.