న్యూఢిల్లీ: ప్రో కబడ్డీ లీగ్‌లో మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్ చిల్లర్‌కు భార్య ఆత్మహత్య కేసులో ఢిల్లీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇండియన్ నేవీలో పనిచేస్తున్న రోహిత్ చిల్లర్‌ను భార్య ఆత్మహత్య కేసులో అక్టోబర్ 21న ముంబైలోని కొలబాలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం అక్టోబర్ 23 (ఆదివారం)న అతడిని ఢిల్లీ కోర్టు డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. అక్టోబర్ 25 వరకు రోహిత్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తిని పోలీసులు కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
దీంతో రోహిత్ చిల్లర్‌ను రెండు రోజుల పాటు పోలీసులు విచారించారు. విచారణ ముగిసిన తర్వాత రోహిత్‌ను మంగళవారం ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వరకట్న వేధింపుల కేసు కావడంతో న్యాయమూర్తి రోహిత్ చిల్లర్‌కు నవంబర్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

మరోవైపు ఈ కేసులో రోహిత్ తండ్రి విజయ్ సింగ్‌కు కోర్టు నవంబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అక్టోబర్ 17న నార్త్ ఢిల్లీలోని తన అపార్ట్‌మెంట్‌లో దుపట్టాతో ఉరివేసుకుని రోహిత్ భార్య లలిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన జరిగిన తర్వాత రోహిత్ కుటుంబం ఇంటికి తాళం వేసి పరారైంది.
అయితే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని అక్టోబర్ 20వ తేదీన పోలీసులు రోహిత్ తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా నోటీసులిచ్చారు. కాగా, ఆరు నెలల క్రితం రోహిత్ చిల్లర్ తో లలితకు వివాహం జరిగింది. లలితకు ఇది రెండో వివాహం కావడం విశేషం.
చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌తో పాటు, రెండు గంటల పాటు రికార్డు చేసిన ఆడియో మెసేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో లలిత 'ఇంకా ఇలా బతికేంత శక్తి నాకు లేదు. చనిపోవాలని నిర్ణయించుకున్నా' అని రాసింది.
దీంతో పాటు వరకట్న వేధింపులను భరించలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఒక నోట్ కూడా పెట్టింది. సూసైడ్ నోట్ ఆధారంగా రోహిత్‌తో పాటు, అతని తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు. లలిత తండ్రి కరణ్ సింగ్ కూడా రోహిత్‌తో పాటు అతడి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.