
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానన్న ఆశ తనలో ఇంకా కాస్త ఉందని భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ చెప్పాడు. సింగపూర్ ఓపెన్ రద్దు కారణంగా ఒలింపిక్స్ అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన శ్రీకాంత్.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ అర్హత టోర్నీలు ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్‌లను బీడబ్ల్యూఎఫ్ రద్దు చేసింది. టోక్యో ఒలింపిక్స్ అర్హతకు సంబంధించి మరోరోజు ప్రకటన విడుదల చేస్తామని పేర్కొంది.
బీడబ్ల్యూఎఫ్ ఇంకా అర్హత ప్రక్రియను ప్రకటించకపోవడంతో మార్పుచేర్పుల్లో తనకు అవకాశం దక్కుతుందేమోనని గురువారం ఓ ఇంటర్వ్యూలోకిదాంబి శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'అర్హత టోర్నీల్లో ఆడుంటే ఒలింపిక్స్ బెర్తును కచ్చితంగా సొంతం చేసుకునేవాడిని. మొత్తం అర్హత ప్రక్రియకు సంబంధించి బీడబ్ల్యూఎఫ్ ఏం చెప్తుందోనని ఎదురుచూస్తున్నా. ఒలింపిక్స్‌కు అర్హతపై కొంత ఆశతో ఉన్నా. బీడబ్ల్యూఎఫ్ ప్రకటన సహజంగానే నా అర్హతకు సానుకూలంగా ఉంటుందనే అనుకుంటున్నా' అని శ్రీకాంత్ చెప్పాడు.
కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రయాణ ఆంక్షలు ఉండడంతో జూన్ 1 నుంచి 6 వరకు జరుగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీని రద్దు చేస్తున్నట్టు సింగపూర్ బ్యాడ్మింటన్ సంఘం (ఎస్‌బీఏ), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించాయి. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. విశ్వక్రీడలకు చివరి అర్హత టోర్నీ నిలిచిపోవడంతో క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్ పాయింట్లలో వెనుకబడి ఉన్న సైనా, శ్రీకాంత్‌కు టోక్యో తలుపులు దాదాపు మూసుకుపోయాయి.
జపాన్ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించి తీరుతామని ఐవోసీ స్పష్టం చేసింది. ప్రజల అభిప్రాయాలను విన్నామని, అయితే వాటిని పాటించలేమని ఐవోసీ నెలవారి సమావేశం తర్వాత వర్చువల్ మీడియా భేటీలో ప్రతినిధి మార్క్ ఆడమ్స్ వెల్లడించాడు. షెడ్యూల్ ప్రకారం జూలై 23 నుంచి ఒలింపిక్స్ జరుగాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతుండడంతో రద్దు చేయాలని మెజార్టీ జపాన్ ప్రజలు కోరుకుంటున్నారు.