న్యూఢిల్లీ: ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన కబడ్డీ వరల్డ్ కప్‌లో భారత కబడ్డీ జట్టు ఇరాన్‌ను ఓడించి హ్యాట్రిక్ టైటిల్ సాధించింది. ఈ విజయంతో దేశం మొత్తం ఎంతగానో సంతోషించింది. దీంతో క్రికెటర్లు, ఒలింపిక్ పతక విజేతలు మాదిరి కబడ్డీ ఆటగాళ్లకు కూడా ప్రశంసలతోపాటు నజరానాల వర్షం కురుస్తుందని అందరూ భావించారు.
వరల్డ్ కప్ కబడ్డీ: మూడోసారి విశ్వవిజేతగా భారత్, ఇరాన్‌పై విజయం
కానీ కబడ్డీ జట్టుని పట్టించుకున్న నాథుడే లేడు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించిన పీవీ సింధుకు దేశ వ్యాప్తంగా వచ్చిన నగదు బహుమతులు రూ. 15 కోట్లు వరకు ముట్టాయి. ఇక 2011లో వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్లకు ఒక్కోక్కరికి రూ. కోటిన్నర వరకు నజరానాలు అందాయి.
అయితే కబడ్డీ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు మాత్రం రూ.10 లక్షల నగదు బహుమతి దక్కింది. అంటే దీనిని అందరూ పంచుకుంటే ఒక్కొక్క అటగాడికి అందేది సుమారు రూ. 67వేలు. టీమిండియా కప్ గెలవగానే ఆ ఘనతేదో తమదే అన్నట్టుగా ట్వీట్ చేసిన కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ కబడ్డీ జట్టుకు ఎలాంటి నగదు బహుమతిని ప్రకటించలేదు.

దీంతో భారత జట్టుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకం పట్ల కబడ్డీ జట్టు ఆటగాడు అజయ్ ఠాకూర్ విచారం వ్యక్తం చేశాడు. క్రీడాశాఖ ప్రకటించిన రూ. 10 లక్షల నగదు బహుమతి చాలా చిన్న మొత్తం అని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆటగాళ్ల కోసం ఏమీ ప్రకటించకపోడవం తనను ఆశ్చర్య పరిచిందని తెలిపాడు.
''దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కినందుకు ఎంతో గర్విస్తున్నా. ప్రపంచకప్‌ను అందుకుంటానని కలలో కూడా అనుకోలేదు. అయితే మా జట్టు సభ్యులెవరికీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇతర సంస్థలు కానీ నగదు బహుమతులు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది" అని ఠాకూర్ వివరించాడు.
"ఒలింపియన్స్, ఇతర క్రీడాకారులను సన్మానిస్తూ మమ్మల్ని మాత్రం విస్మరించడం ఎంతో ఆవేదనకు గురిచేసింది. జట్టు మొత్తానికి దక్కింది రూ. 10 లక్షలు మాత్రమే. నేనేమీ కాసుల వర్షం కురిపించమనడం లేదు. మేం సాధించిన విజయానికి తగిన గుర్తింపు రాలేదు' అని ఆవేదన చెందాడు.
ఏడాది పొడవునా సాగే మా జాతీయ శిబిరాలన్నింటినీ సాధారణ మైదానాల్లోనే నిర్వహిస్తారు. టర్ఫ్‌పై కాదు. కాబట్టి మాకు నగదు బహుమతులు ఇవ్వకపోయినా, సన్మానాలు చేయకపోయినా టర్ఫ్‌లపై ఆడే ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని అజయ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశాడు. కాగా, కబడ్డీ వరల్డ్ కప్‌లో 64 పాయింట్లు సాధించి భారత్ గెలవడంలో అజయ్ ఠాకూర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.