శంషాబాద్: కబడ్డీ ఆట ఓ కుటుంబంలో విషాదం నింపింది. సరదాగా ఆడుకున్న కబడ్డీ ఆడిన చిన్నారులు.. చిన్న గొడవతో బాహాబాహికి దిగారు. మిగతా స్నేహితులు సర్ది చెప్పడంతో అక్కడికి వివాదం సమసిపోయింది. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఇద్దరు కొట్టుకోవడంతో.. ఓ చిన్నారి ప్రాణం కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో అరుణ్, మల్లిఖార్జున్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీళ్లిద్దరు స్థానికంగా ఎనిమిదో తరగతి చదువుతున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో పిల్లలంతా కలిసి కబడ్డీ ఆడుకుంటుండగా అరుణ్-మల్లిఖార్జున్ మధ్య గొడవ తలెత్తింది.

మిగతా స్నేహితులంతా కలిసి వీరిని నియంత్రించారు. అక్కడినుంచి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. అయితే అప్పటికీ శాంతించని అరుణ్ మల్లిఖార్జున్ ఇంటికెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అరుణ్ దెబ్బలకు తాళలేక మల్లిఖార్జున్ స్పృహ కోల్పోయాడు.
గమనించిన స్థానికులు మల్లిఖార్జున్ ను శంషాబాద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో మల్లిఖార్జున్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు కమ్ముకున్నాయి.