
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ 8లో జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యూపీ యోధాపై జయభేరి మోగించింది. అంతేకాకుండా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో జైపూర్ రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే జైపూర్ అధిక్యం కనబరిచింది. ఆ జట్టు రైడర్లు అర్జున్ దేశ్వాల్, దీపక్ హుడా చెలరేగడంతో ఫస్ట్ హాఫ్‌లోనే యూపీ యోధాను ఆలౌట్ చేసి 15-8తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత యూపీ యోధా రైడర్ సురేందర్ గిల్ సూపర్ రైడ్ చేయడంతో జైపూర్ అధిక్యం కాస్త తగ్గింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 19-12తో జైపూర్ అధిక్యంలో నిలిచింది.
హోరాహోరిగా సెకండాఫ్
హాఫ్ టైమ్ తర్వాత రోహిత్ తోమర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా మ్యాచ్‌లోకి తీసుకు రావడం యూపీకి కలిసొచ్చింది. చివరి 5 నిముషాల్లో రోహిత్ చెలరేగాడు. అప్పటివరకు మంచి అధిక్యంలో ఉన్న జైపూర్ అధిక్యాన్ని తగ్గించాడు. ఈ సమయంలో జైపూర్ కెప్టెన్ దీపక్ హోడా బాధ్యతతో ఆడాడు. దీంతో జైపూర్ చివరి వరకు అధిక్యాన్ని కాపాడుకుంది. అయితే చివరి నిముషంలో జైపూర్ ఆటగాడు జైశ్వాల్ చేసిన తప్పదంతో తోమర్ మరో రెండు పాయింట్ల సాధించి జైపూర్ అధిక్యాన్ని తగ్గించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మ్యాచ్ ముగియడానికి మరో 10 సెకన్స్ సమయం మాత్రమే ఉన్నది.
దీంతో యూపీ యోధాపై జైపూర్ పింక్ పాంథర్స్ 32-29 తేడాతో విజయం సాధించింది. జైపూర్ రైడర్లలో అర్జున్ దేశ్వాల్ 11, దీపక్ హుడా 9 పాయింట్లతో సత్తా చాటారు. నితిన్ రావల్ 4, విశాల్ 2 ట్యాకిల్ పాయింట్ల సాధించారు. ఇక యూపీ ఆటగాళ్లలో సురేందర్ గిల్ 10, రోహిత్ తోమర్ 7 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో యూపీ 23 రైడ్ పాయింట్లు సాధించగా.. జైపూర్ 20 రైడ్ పాయింట్లు సాధించింది. యూపీ 4 ట్యాకిల్ పాయింట్లు సాధించగా.. జైపూర్ 8 సాధించింది. జైపూర్, యూపీ చెరో రైడ్ పాయింట్ సాధించాయి. ఇక అంతకుముందు తమిళ్ తలైవస్, యూపీ యోధా మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు 30-30తో టైగా ముగిసింది.
నేటి మ్యాచ్‌లు
నేడు జరగనున్న తొలి మ్యాచ్‌లో పుణేరి పల్టాన్, పాట్నా పైరేట్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. 8:30 గంటలకు ప్రారంభం కానున్న మరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, హర్యానా స్టీలర్స్ తలపడనున్నాయి.