అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచ కప్‌లో టీమిండియా అదరగొట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. శనివారం అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాపై 74-20తో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ మ్యాచ్‌లో భారత్ మొదట నుంచి పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చి, దూకుడుగా ఆడింది. టీమిండియా రైడర్లు రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్, డిఫెండర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో మ్యాచ్ ఫస్టాప్ ముగిసే సరికి భారత్ 36-13తో ఆధిక్యంలో నిలిచింది.

ఇక ద్వితీయార్థంలో రాహుల్ చౌదరి రాకతో భారత్ మరింత రెచ్చిపోయింది. వరుస పాయింట్లతో సత్తా చాటింది. అర్జెంటీనా ఆటగాళ్లను ఒడిసి పడుతూ టీమిండియా ఆటగాళ్లు చెలరేగిపోయారు. దీంతో మ్యాచ్ ముగిసే సరికి భారత్ 54 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ రైడ్స్ రూపంలో 37, ట్యాకిల్స్‌తో 24, అర్జెంటీనాను 6 సార్లు ఆలౌట్ చేసి 12 పాయింట్లు సాధించింది. అర్జెంటీనా 16 రైడ్, 3 ట్యాకిల్ పాయింట్లు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో టీమిండియా టోర్నీలో సెమీఫైనల్ చేరింది. కాగా, భారత్ మరో రెండు పాయింట్లు చేసుంటే ఈ టోర్నీలో అత్యధిక పాయింట్లు చేసిన జట్టుగా నిలిచేది.
ప్రస్తుతం ఈ రికార్డు పోలాండ్ (75 పాయింట్లు) పేరిట ఉంది. ఇక, శనివారం అంతక ముందు జరిగిన మ్యాచ్‌ల్లో దక్షిణకొరియా 63-25తో ఆస్ట్రేలియాపై, ఇరాన్ 38-34తో జపాన్‌పై విజయాలు సాధించాయి.