
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ ఆరో సీజన్‌లో గుజరాత్ ఫార్చ్యూన్‌జెయింట్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 45-38తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. దక్షిణ కొరియా ఆటగాడు డాంగ్ జియాన్ లీ రాణించడంతో ఆ జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకున్నట్లు అయింది.
ఢిల్లీకిది హ్యాట్రిక్ ఓటమి. గుజరాత్ తరపున రైడింగ్‌లో డాంగ్ లీ (10), ట్యాకింగ్‌లో పర్వేశ్ (6) సత్తాచాటారు. ఢిల్లీ జట్టులో చంద్రన్ రంజిత్ (11) రైడింగ్‌లో రాణించినా జట్టుకు నిరాశ తప్పలేదు. రైడర్ రోహిత్ గులియా వరుస పాయింట్లు తేవడంతో గుజరాత్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. తొలి నాలుగు నిమిషాల్లోనే 11-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అదే జోరు కొనసాగిస్తూ ఢిల్లీని ఆలౌట్ చేసి తొలి అర్ధభాగం ముగిసే సరికి గుజరాత్ 27-18తో నిలిచింది. విరామం అనంతరం డాంగ్ లీ చెలరేగడంతో గుజరాత్ జట్టు పాయింట్లు పెంచుకుంటూ పోయింది. మరోవైపు ఢిల్లీ ట్యాకింగ్‌లో పూర్తిగా విఫలమైంది. ఆట ఇంకో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా 45-38తో ఆధిక్యాన్ని సాధించిన గుజరాత్ అదే జోరులో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
యూపీ యోధ-బెంగాల్ వారియర్స్ మధ్య ఆఖరి రైడ్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్ 30-30 స్కోరుతో డ్రాగా ముగిసింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగి టై అవడం గమనార్హం. లీగ్‌లో సోమవారం విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో హరియాణా స్టీలర్స్, యూపీ యోధాతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.