
కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టాక ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 తొలి రోజే అభిమానులకు అసలైన కబడ్డీ మజాను అందించింది. బెంగళూరు వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ బెంగాల్ వారియర్స్, యూపీ యోధా మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌నే విజయం వరించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 38-33 తేడాతో ఈ సీజన్‌లో బెంగాల్ బోణీ చేసింది. బెంగాల్ రైడర్ ఎస్మాయిల్ నబీబక్ష్ మ్యాచ్‌లో అత్యధికంగా 11 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత సుకేష్ హెగ్దే 8, మనీందర్ సింగ్ 7 పాయింట్లు సాధించాడు. దర్శన్ మూడు ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. రింక్ నర్వాల్, ప్రవీణ్ ట్యాకిల్ చేసి చెరో పాయింట్ సాధించారు. ఇక యూపీ యోధా జట్టులోని రైడర్ ప్రదీప్ నర్వాల్ అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో సురేందర్ గిల్ 5, రోహిత్ తోమర్ 4 పాయింట్లు సాధించారు. నితీష్ కుమార్, అశు సింగ్ ట్యాకిల్ చేసి చెరో పాయింట్లు సాధించారు. శుభమ్ కుమార్ 2 పాయింట్లు సాధించాడు. అలాగే సుమిత్, శ్రీకాంత్ జాదవ్ చెరో పాయింట్ సాధించారు.
మొత్తంగా మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 23 రైడ్ పాయింట్లు సాధించగా, యూపీ యోధా 18 రైడ్ పాయింట్లు సాధించింది. బెంగాల్ జట్టు రెండు సార్లు సూపర్ రైడ్‌లు చేయగా, యూపీ జట్టు ఒకసారి కూడా చేయలేకపోయింది. బెంగాల్ 8 ట్యాకిల్ పాయింట్లు సాధించగా, యూపీ 9 సాధించింది. ఇక ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసి బెంగాల్ 4 అదనపు పాయింట్లు సాధించగా, ఒక సారి మాత్రమే ఆలౌట్ చేసి యూపీ 2 పాయింట్లు సాధించింది. యూపీ యోధా 4 ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించగా, బెంగాల్ 3 సాధించింది. మొత్తంగా మ్యాచ్‌ను 38-33 తేడాతో గెలుచుకోని సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగాల్ వారియర్స్ బోణీ చేసింది. అంతేకాకుండా ఈ విజయంతో 5 పాయింట్లను ఖాతాలో వేసుకోని పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ ప్లేసులో నిలిచింది. బెంగాల్ కంటే ముందు యూ ముంబా ఉంది. కాగా అంతకు ముందు జరిగిన మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌పై యూముంబా 46-30 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 40-40తో టైగా ముగిసింది.
నేటి మ్యాచ్‌లు
ప్రోకబడ్డీ లీగ్ 2021లో నేడు కూడా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాత్రి 7:30 గంటలకు జరగనున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి. రాత్రి 8:30 గంటలకు జరగనున్న మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టాన్‌ను ఢీకొట్టనుంది. అలాగే రాత్రి 9:30 గంటలకు జరగనున్న మూడో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్ తలపడనున్నాయి.