
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల హాకీ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచే అవకాశాన్ని చేజేతులా వృథా చేసుకొని చివరకు 1-1తో డ్రా చేసుకున్న భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో గురువారం ఆడనుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ నాకౌట్ అవకాశాలు మెరుగైనట్లే. ఇంగ్లండ్‌పై చేసిన తప్పిదాలను ఇక్కడ పునరావృతం చేయబోమంటున్న భారత జట్టు.... తమకంటే తక్కువ ర్యాంకులో ఉన్న ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించి ప్రపంచకప్‌లో ముందడుగు వేయాలని ఉవ్విళ్లూరుతోంది. అటాకింగ్, డిఫెన్స్‌లో భారత్ బలంగా కనిపిస్తోంది.
తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టును అద్భుతంగా నిలువరించిన భారత జట్టు ఆఖరి ఆరు నిమిషాల్లో మ్యాచ్‌ను ప్రత్యర్థికి సమర్పించుకున్నారు. లేదంటే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై విజయం సాధించేదే. తొలిమ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్ అవకాశాలను సృష్టించుకోవడంలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది.

దీంతో మ్యాచ్ మొత్తమ్మీద భారత జట్టుకు ఒక్క పెనాల్టీ అవకాశం దక్కలేదు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మెరుపు దాడులను అడ్డుకోవడంలో భారత గోల్‌కీపర్ సవిత సఫలమైంది. మరోవైపు చిన్నజట్టని ఐర్లాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఎందుకంటే తొలిమ్యాచ్‌లో తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న యుఎస్‌ఏకు షాకిస్తూ ఐర్లాండ్ 3-1తో విజయం సాధించింది. దీంతో ప్రసుత్తం పూల్-బిలో 3 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. ఇదే జోరును భారత్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా కొనసాగిస్తామని ఐర్లాండ్ చెబుతోంది.
గతేడాది వరల్డ్ హాకీ లీగ్(హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్ టోర్నీలో ఐర్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారత జట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్ సాయంత్రం 6.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్- 2లో ప్రసారమవుతుంది.