
లండన్: మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో అనూహ్యమైన ప్రదర్శనతో రేస్‌లో నిలిచిన భారత మహిళల హాకీ జట్టును నాలుగు దశాబ్దాల తర్వాత సెమీస్ ఆశలు ఊరిస్తున్నాయి. గురువారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో జెయింట్ కిల్లర్ ఐర్లాండ్‌ను చిత్తు చేసి గ్రూప్ దశలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ ఆశపడుతోంది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత ఫైనల్-4లోకి అడుగుపెట్టాలనే పట్టుదలతోనూ భారత్ కనిపిస్తోంది.
క్వార్టర్స్‌లో ఐర్లాండ్‌ను ఓడిస్తే వరల్డ్‌కప్ చరిత్రలో రెండోసారి సెమీస్‌కు అర్హత సాధించినట్లే. 1974 ఫ్రాన్స్‌లో జరిగిన కప్‌లో భారత్ మొదటిసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-బిలో అద్భుత ప్రదర్శనతో టాపర్‌గా నిలిచిన ఐర్లాండ్‌తో మ్యాచ్ భారత్‌కు ఒక రకంగా కఠిన పరీక్షే..! వరల్డ్ నెం:16 ఐర్లాండ్.. తన కంటే మెరుగైన అమెరికా, భారత్‌ను ఓడించి ఫుల్ ఫామ్‌లో ఉంది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 0-1తో ఓడినా నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగలిగింది.
మరోవైపు భారత్ రౌండ్-8కు చేరుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. ఇంగ్లండ్, అమెరికాతో డ్రా చేసుకున్న భారత్.. ఐర్లాండ్ చేతిలో 0-1తో పరాజయాన్ని చవిచూసింది. టోర్నీ ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపని భారత అమ్మాయిలు ఇటలీతో ప్లేఆఫ్ మ్యాచ్‌లో సత్తాచాటి తిరిగి ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. అదే జోరు ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని రాణి రాంపాల్ సేన భావిస్తోంది. కానీ క్వార్టర్స్ బెర్త్ కోసం ఇటలీతో జరిగిన నాకౌట్ పోరులో మాత్రం అదరగొట్టి 3-0తో నెగ్గడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
కెప్టెన్ రాణి, గోల్‌కీపర్ సవిత గొప్ప ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీమిండియాకు డిఫెన్స్ ప్రధాన బలంగా నిలుస్తోంది. టోర్నీ సాగే కొద్దీ పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో భారత్ మహిళలు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. అయితే, ఐర్లాండ్‌తో మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌ను ఐర్లాండ్ సున్నా పాయింట్లతో ఓడించగలిగింది. భారత్, ఐర్లాండ్ మధ్య క్వార్టర్స్ మ్యాచ్ రాత్రి 10.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారమవుతుంది.