
హైదరాబాద్: అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. సీనియర్లు లేకుండానే బరిలోకి దిగిన భారత యువ జట్టు తమ ప్రారంభ మ్యాచ్‌లో పోరాడి ఓడిపోయింది. శనివారం ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో ఆఖరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో భారత్ 2-3తో పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అమిత్ రోహిదాస్ (26, 31వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. అర్జెంటీనా జట్టు పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ గొంజాలొ పీలాట్ (13, 24, 33వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో నమోదైన ఐదు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ ద్వారానే రావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు అమిత్ రోహిదాసె రెండు గోల్స్ చేసినా.. అకాలవర్షంతో మ్యాచ్ నాలుగో క్వార్టర్ రద్దు కావడంతో భారత్‌కు నిరాశే ఎదురైంది. అంతగా అనుభవం లేని భారత జట్టును సీనియర్ సర్దార్ సింగ్ అద్భుతంగా నడిపించాడు. ఆరంభంలో భారత్ దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది.
పది నిమిషాల్లోపే సుమిత్ కుమార్ కొట్టిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తొలి క్వార్టర్ ముగుస్తుందనగా 13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను పీలాట్ గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత రెండు నిమిషాల తర్వాత భారత్ వరుసగా మూడు పెనాల్టీకార్నర్‌లు సాధించింది.
కానీ ఈ మూడింట్లో ఒక్కదాన్నీ గోల్‌గా మలచలేకపోయింది. మరోవైపు అర్జెంటీనా మరో గోల్ చేసి రెండో క్వార్టర్ చివరికి 1-2తో నిలిచింది. మూడో క్వార్టర్‌లో అమిత్ గోల్ చేయడంతో 2-2తో స్కోరు సమం చేసింది. కానీ ఈ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. మూడో గోల్‌తో గొంజాలో 3-2తో అర్జెంటీనాను ఆధిక్యంలో నిలిపాడు.
నాలుగో క్వార్టర్‌లో ఉరుములతో కూడిన వర్షం కారణంగా మ్యాచ్‌ను గంట సేపు ఆపారు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా రద్దు కావడంతో భారత్ పరాజయం పాలైంది. టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.