
హైదరాబాద్: భారత దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న. ఈ అత్యున్నత పురస్కారం పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మారుస్తున్నామని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కొద్దిసేపట్లోనే సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రధాని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో నెటిజన్లు మరో ఆలోచనను కూడా పంచుకున్నారు. ఇకపై క్రీడా పురస్కారాలన్నింటికి.. రాజకీయనేతల పేర్లు కాకుండా క్రీడాకారుల పేర్లే పెట్టాలని సూచించారు. కొందరు మాజీ క్రికెటర్లు కూడా తమ ఆలోచనలు పంచుకున్నారు.
భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓ ట్వీట్ చేశారు. 'ఈ మార్పుని కచ్చితంగా స్వాగతిస్తున్నాం. క్రీడాకారుల పేర్లమీద పురస్కారాలు అందిస్తే వారికి గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తులో స్టేడియం పేర్లకు క్రీడాకారుల పేర్లే పెడతారని భావిస్తున్నా' అని ట్వీట్ చేశారు. ఇర్ఫాన్ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. మరోవైపు గుజరాత్ ప్రతిపక్షనేత శంకర్ సిన్హ్ వాఘేలా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 'ఈ మార్పు చేసిన మీరే.. నరేంద్ర మోదీ స్టేడియంకి తిరిగి సర్దార్ పటేల్ స్టేడియంగా మార్చాల్సిందిగా కోరుతున్నా' అంటూ ట్వీట్ చేశారు.
ఈ చర్చ కేవలం ప్రముఖులతో ఆగిపోలేదు. రాజీవ్ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మార్చి మోదీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. అదే స్ఫూర్తితో నరేంద్రమోదీ స్టేడియం, జైట్లీ స్టేడియంలకు క్రీడాకారుల పేర్లు పెట్టాలి. రాజకీయ నేతల పేర్లు తీసేయాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేశారు. ఓ యూట్యూబర్ ధృవ్ రాఠీ ట్వీట్ చేస్తూ.. 'నరేంద్ర మోదీ, జైట్లీ స్టేడియాల పేర్లూ మార్చండి. అసలు రాజకీయ నాయకుల పేర్లను తీసేయండి' అని పేర్కొన్నాడు.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన మోతెరా స్టేడియం.. సర్దార్ పటేల్ స్టేడియం అని కూడా పిలుస్తారు. 2020 ఫ్రిబవరిలో సర్దార్ పటేల్ స్టేడియం పేరుని నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కి అధ్యక్షత వహించినందుకు గానూ మోదీకి ఈ గుర్తింపు ఇచ్చినట్లు అప్పట్లో పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మోదీ స్టేడియంను ఆరంభించారు. ఆపై అంతర్జాతీయ మ్యాచులు కూడా అక్కడ జరిగాయి.
మరోవైపు దివంగత భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2019లో మరణించారు. డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కి అధ్యక్షత వహించినందకు గానూ ఆయన మరణాంతరం డిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జెట్లీ స్టేడియంగా నామకరణం చేశారు. ఈ విషయంలో అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు మరోసారి ఆ స్టేడియం పేరు చర్చకు వచ్చింది.
ఇక తన తండ్రి ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న ఈ హాకీ లెజెండ్ కుమారుడు అశోక్ కుమార్.. ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పును స్వాగతించారు. ధ్యాన్‌చంద్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ హాకీ ప్లేయర్స్‌లో ఒకరు. ఇండియన్ హాకీ టీమ్ సాధించిన తొలి మూడు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్‌లో ధ్యాన్‌చంద్ పాత్రే కీలకం. 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించినప్పుడు ధ్యాన్‌చందే కీలకపాత్ర పోషించారు. అలాంటి వ్యక్తికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉంది.