Tokyo Olympics: భారత హాకీ జట్టుకు కాంస్యం.. తెరవెనుక హీరో ఆ రాష్ట్ర సీఎం! ఏం చేశాడంటే?

న్యూఢిల్లీ: 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. గురువారం హోరాహోరీగా సాగిన కాంస్య పోరులో మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు 5-4తో జర్మనీని చిత్తు చేసింది. ఫలితంగా 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణం తర్వాత మళ్లీ విశ్వక్రీడల్లో పతకాన్ని అందుకుంది. ఈ అద్భుతమైన విజయానికి అఖండ భారతావని మురిసిపోయింది. అశేష ప్రజానీకం ఉప్పొంగి పోయింది.130 కోట్ల భారతీయుల హృదయాలు పులకించిపోయాయి. సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. టోక్యో నడిబొడ్డున త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. చెక్‌దే ఇండియా నినాదాలు మార్మోగాయి.

అయితే ఒకప్పుడు వెలుగు వెలిగిన భారత హాకీ ఆ తర్వాత మరుగున పడింది. పైగా ఇది మన జాతీయ క్రీడ కూడా. అంతే తప్పా ఈ ఆట గురించి పెద్దగా ఎవరికి కూడా తెలియదు. 1983 క్రికెట్ ప్రపంచకప్ విజయం తర్వాత దేశంలో క్రికెట్ ఆదరణ పెరగాక.. హాకీ పాతాళానికి పడిపోయింది. అసలు ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్ సాధించిన పతకాలే 32 అయితే అందులో 11 హాకీలోనే వచ్చాయి(టోక్యో మినహాయించి). 8 స్వర్ణాలు, ఓ రజతం రెండు కాంస్యలు భారత హాకీ టీమే గెలుపొందింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న హాకీ ఇండియా ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఎంతలా అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌‌కు క్వాలిఫై కూడా కాలేదు.

తెరవెనుక హీరో ఒడిశా సీఎం

తెరవెనుక హీరో ఒడిశా సీఎం

అలాంటి ప‌రిస్థితుల నుంచి ఇప్పుడు మ‌ళ్లీ అదే ఒలింపిక్స్‌లో మెడ‌ల్ గెలిచే స్థాయికి భారత జట్టు చేరిందంటే కోచ్ ఆటగాళ్లు కష్టం ఎంత ఉందో.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువే ఉంది. యావత్ భారతం క్రికెట్ పిచ్చిలో మునిగి తేలుతుండటంతో ఇతర ఆటలకు ఆదరణ లేకుండా పోయింది.

దాంతో కాసులు కురిపించే క్రికెట్‌ను కాదని ఇతర ఆటలను ప్రమోట్ చేసేందుకు స్పాన్సర్లు ముందుకు రావడం కష్టమైంది. చాలా ఏళ్లు భారత హాకీ టీమ్‌కు సహారా స్పాన్సర్‌గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఆటకు ఆదరణ తక్కువవడంతో 2018లో సహారా తప్పుకుంది. హాకీ గేమ్‌కు కూడా ఇతర ఆటల్లానే స్పాన్సర్‌ను వెతుకునే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి స‌మ‌యంలో ఒడిశా సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ ముందుకొచ్చారు.

హాకీ ప్లేయర్ కావడంతో...

హాకీ ప్లేయర్ కావడంతో...

హాకీ ఆటపై ఉన్న మక్కువతో పాటు జాతీయ క్రీడను బతికించాలనే ఆలోచనతో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందని చెప్పాడు. ఐదేళ్ల‌కుగాను నవీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం రూ.100 కోట్లకు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందమే భారత హాకీ టీమ్ రాత‌ను మార్చింది. న‌వీన్ ప‌ట్నాయ‌క్ గ‌తంలో హాకీ ప్లేయ‌రే. ఆయ‌న స్కూల్‌లో చ‌దువుతున్న స‌మ‌యంలో హాకీ గోల్‌కీప‌ర్‌గా తన టీమ్‌ తరఫున బరిలోకి దిగేవాడు.

ఆ ఇష్టంతోనే టీమ్‌కు స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి ఆయ‌న ముందుకు వ‌చ్చారు. పురుషుల జ‌ట్టుతోపాటు మ‌హిళ‌లూ జ‌ట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్స‌ర్‌గా ఉండ‌టానికి ఒడిశా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అయిన మూడేళ్ల తర్వాత హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచింది. మ‌హిళల టీమ్ కూడా మెడ‌ల్‌కు అడుగు దూరంలో ఉంది.

భారత హాకీ ప్రతీ అడుగులో..

భారత హాకీ ప్రతీ అడుగులో..

2014లో ఒడిశా ప్ర‌భుత్వం చాంపియ‌న్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్య‌మిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్స‌ర్‌షిప్‌కు బీజం ప‌డింది. ఆ టోర్నీపై న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. ఆ త‌ర్వాత 2017లో ఒడిశా ప్ర‌భుత్వం స్పాన్స‌ర్‌గా ఉన్న క‌లింగ లాన్స‌ర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వ‌ర‌ల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వ‌హించింది. ఆ త‌ర్వాత 2019లో ఇంట‌ర్నేష‌న‌ల్ హాకీ ఫెడ‌రేష‌న్ మెన్స్ సిరీస్ ఫైన‌ల్స్‌, ఒలింపిక్ హాకీ క్వాలిఫ‌య‌ర్స్‌.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జ‌రిగాయి. ఇలా ఇండియ‌న్ హాకీ వేసే ప్ర‌తి అడుగులోనూ న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెర వెనుక హీరోగా ఉంటూ వ‌స్తున్నారు.

స్పోర్ట్స్ హబ్‌గా ఒడిశా

స్పోర్ట్స్ హబ్‌గా ఒడిశా

ఇక, మన హాకీ ప్లేయర్లు ఒడిశాని తమ రెండో ఇల్లుగా భావిస్తారు. ఒడిశాను మన దేశంలోనే స్పోర్ట్స్ హబ్‌గా హాకీ ప్లేయర్లు పేర్కొంటారు. హాకీకి కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా.. మౌలిక సదుపాయాలు కూడా అందించింది నవీన్ పట్నాయక్ సర్కార్. ఈ ఒలింపిక్స్‌లో ఇండియ‌న్ టీమ్ ఆడిన ప‌లు మ్యాచ్‌ల‌ను న‌వీన్ ప‌ట్నాయ‌క్ చూశారు. ఇప్పుడు బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత కూడా టోక్యోలో ఉన్న టీమ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి శుభాకాంక్ష‌లు చెప్పారు. ప్ర‌తి భార‌తీయుడికీ ఇది గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని న‌వీన్ ప‌ట్నాయ‌క్ అన్నారు. ఒడిశా నుంచి పురుషుల, మహిళల జట్లులో ప్లేయర్లున్నారు.

మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారత క్రీడాకారులు హాకీలో కాంస్య పతకం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్‌ను, జట్టు క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రశంసించారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 5, 2021, 17:54 [IST]
Other articles published on Aug 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X