న్యూఢిల్లీ: భారత హాకీ కోచ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని టెర్రీ వాల్ష్.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్‌కు లేఖ రాశాడు. "పురుషుల హాకీ కోచ్‌గా వెంటనే తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. అంతేగాక నాపై వచ్చిన ఆరోపణలు తప్పని బహిరంగంగా నిరూపించేందుకు సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) తో చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను" అని వాల్ష్ తన లేఖలో పేర్కొన్నాడు.
టెర్రీ వాల్ష్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని హాకీ ఇండియా అధ్యక్షుడు నరిందర్ బాత్రా ఆరోపణలు చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఆస్ట్రేలియాకు చెందిన వాల్ష్ వాస్తవం కాదని రుజువు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలతో ఇంచియాన్ నుంచి తిరిగి రాగానే రాజీనామా చేశారు. 16 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో పురుషుల హాకీ బంగారు పతకం సాధించడంతో కీలక పాత్ర పోషించారు.

నిర్ణయాల్లో పూర్తి అధికారాలు, స్వతంత్రత కల్పించాలని, అలాగే భారత్‌లో తాను ప్రత్యక్షంగా ఉండి సమీక్షించాల్సిన వ్యవహారాలు లేని సమయంలో తన సొంత దేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లే విధంగా నూతన ఒప్పందాన్ని రూపొందించాలని వాల్ష్ డిమాండ్‌కు హెచ్‌ఐ, సాయ్ అంగీకరించకపోవడంతో వాల్ష్ గత నెలలోనే రాజీనామా చేశాడు.
వాల్ష్ ప్రతిపాదనలను పరిశీలించేందుకు సాయ్ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యలు కమిటీ కూడా క్రీడల మంత్రిని కలుసుకుంది. "కోచ్‌గా వాల్ష్ పనితీరును మంత్రి మెచ్చుకున్నారు. భారత హాకీని ముందుకు తీసుకెళ్లడానికి అతడే సరైన వ్యక్తని అభిప్రాయపడ్డారు. వాల్ష్ ప్రతిపాదనలను ఆయన జాగ్రత్తగా విన్నారు. అన్నింటీకి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఐతే ఆస్టేలియా వెళ్లేందుకు తనకు కొన్ని రోజుల విరామం కావాలని అడిగాడు." అని కమిటీ సభ్యుడు, సాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధీర్ సెతియా చెప్పాడు.