
హైదరాబాద్: సుల్తాన్ అజ్లాన్ షా టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బలహీనతను భారత్ మరోసారి బయటపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెనాల్టీ కార్నర్లలో ఒక్కదాన్నీ సద్వినియోగం చేసుకోలేక చేజేతులా విజయాన్ని దూరం చేసుకుంది.
దీంతో ఆదివారం ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. అందివచ్చిన గోల్ అవకాశాలను చేజార్చుకున్నభారత జట్టు చివరకు డ్రాతో సంతృప్తి చెందించింది. తొలిమ్యాచ్‌లో ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనా చేతిలో 2-3 తేడాతో ఓడిన భారత హాకీ జట్టు రెండో మ్యాచ్‌ని డ్రాగా ముగించింది.
ఈ మ్యాచ్‌లో ఆద్యంతం భారత్ జట్టు తన జోరుని కొనసాగించింది. తొలి క్వార్టర్ ముగుస్తుందనగా భారత యువ ఆటగాడు షీలానంద్ లార్కా అద్భుతం చేశాడు. 14వ నిమిషంలో కళ్లు చెదిరే రీతిలో తొలి అంతర్జాతీయ గోల్ నమోదు చేసి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఇక, రెండో క్వార్టర్లో భారత్ దాడులను మరింత పెంచింది.

ఈ ఒక్క క్వార్టర్‌లోనే భారత్‌కు ఎనిమిది పెనాల్టీకార్నర్లు దక్కడం విశేషం. కానీ డ్రాగ్‌ఫ్లిక్ స్పెషలిస్టులు వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్ వీటిని గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో అమిత్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా కొట్టగా.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గోల్‌కీపర్ జార్జ్ పిన్నర్‌ను బోల్తా కొట్టించలేకపోయాడు.
ఇంగ్లాండ్ గోల్‌కీపర్ భారత ఆటగాళ్ల ప్రయత్నాలను అడ్డుకున్న తీరు అద్భుతం. ఇక మూడో క్వార్టర్‌లో రెండు జట్లూ గట్టిగా పోరాడాయి. పదే పదే ఇంగ్లాండ్ గోల్ పోస్టుపై దాడులు కొనసాగించి గోల్ అవకాశాలను సృష్టించుకుంది. కానీ ఇంగ్లాండ్ డిఫెన్స్ బలంగా ఉండడంతో గోల్స్ నమోదు చేయడంతో భారత్ విఫలమైంది.
48వ నిమిషంలో లభించిన 9వ పెనాల్టీకార్నర్‌ను భారత్ వృధా చేయడం విజయవకాశాలను దెబ్బ తీసింది. కాగా, 54వ నిమిషంలో ఇంగ్లండ్‌కు లభించిన పెనాల్టీస్ట్రోక్‌ను అద్భుత వేగంతో గోల్‌గా మలిచిన మార్క్ గ్లెగ్ హార్న్ స్కోరును 1-1తో సమం చేసి జట్టుకు ఓటమి తప్పించాడు. ఆ తర్వాత భారత్ గోల్ ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లాడిన భారత్, ఇంగ్లాండ్ జట్లు విజయం సాధించలేకపోయాయి. తొలి మ్యాచ్‌లో భారత్ అర్జెంటీనా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. మంగళవారం భారత జట్టు ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టనుండగా.. ఇంగ్లండ్ జట్టు ఐర్లాండ్‌తో తలపడనుంది.