
కోట్లాది మంది అభిమానుల ఆశలను మోస్తూ లండన్ ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత హాకీ జట్టు మంగళవారం జరిగిన గ్రూప్-బి ప్రిలిమినరి లీగ్ ఆఖరి మ్యాచ్‌లో భారత్ 0-3తో బెల్జియం చేతిలో ఓడింది. మరోవైపు ఒలింపిక్స్‌లో భారత్‌పై గెలవడం బెల్జియంకు ఇదే మొదటిసారి. దీంతో తొలిసారి కనీసం ఒక్క పాయింట్ కూడా లేకుండా గ్రూప్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలోనే 'అన్ని పరాజయాల' రికార్డును నమోదు చేసింది. గతంలో 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్ ఎనిమిదో స్థానంతో నిలవడం ఇప్పటిదాకా ఉన్న చెత్త ప్రదర్శన. ఇప్పుడు 11-12వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్.... దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.
ఒలింపిక్స్‌లో పసికూనగా పరిగణించిన బెల్జియం చేతిలో కూడా చిత్తవ్వడం భారత అభిమానులను మరింత నిరాశకు గురిచేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఏ దశలోనూ భారత్‌ను కోలుకోనివ్వలేదు. 15వ నిమిషంలో వెటరన్ జెరోమ్ డెకిసర్ బెల్జియంకు తొలి గోల్ అందించాడు. మరోవైపు భారత్ కూడా స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా పోరాడింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ద్వితీయార్ధంలో బెల్జియం మరో రెండు గోల్స్ సాధించింది. 47వ నిమిషంలో గాటియర్, 67వ నిమిషంలో టామ్ బూన్ బెల్జియంకు గోల్స్ సాధించి పెట్టారు.
ఆట 12వ నిమిషంలో బెల్జియం కొట్టిన తొలి పెనాల్టీ కార్నర్ కాగా... మరో రెండు నిమిషాల తర్వాత ప్రత్యర్థి సర్కిల్‌లోకి వెళ్లిన భారత్ గోల్ చేసే అవకాశాన్ని సృష్టించుకోలేకపోయింది. 21వ నిమిషంలో లభించిన పెనాల్టీని డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్ వృథా చేయగా... 22వ నిమిషంలో సర్కిల్ నుంచి తుషార్ కొట్టిన రెండు షాట్లు గోల్‌పోస్ట్‌పై నుంచి బయటకు వెళ్లాయి. 34వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని శివేంద్ర జారవిడిచాడు. అతను కొట్టిన బంతి రీబౌండ్ కావడంతో గోల్ కీపర్ అడ్డుకున్నాడు. 39వ నిమిషంలో లభించిన రెండో పెనాల్టీని సందీప్ మళ్లీ వృథా చేశాడు. ఇలా తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ చేజేతులా బెల్జియం చేతిలో ఓడిపోయింది.
తెలుగు వన్ఇండియా