న్యూఢిల్లీ: మలేషియాలో ఆదివారం జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత హాకీ జట్టుకు ప్రముఖులు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పాక్‌కు భారత్ షాక్: దీపావళి గిప్ట్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ
దీంతో భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీని రెండోసారి గెలుచుకుంది. 2011లో ఆరంభమైన ఈ ఛాంపియన్స్ టోర్నీలో తొలి విజేతగా అవతరించిన భారత్ ట్రోఫీని చేజిక్కించుకుంది. ఆ తర్వాత 2012లో పాకిస్థాన్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. 2013లో జరిగిన టోర్నీలో జపాన్‌పై పాకిస్థాన్ గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది.
అయితే 2016 టోర్నీలో భాగంగా లీగ్ దశలోనే ఒకసారి భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్, ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైంది. భారత్ విజేతగా నిలిచిన రెండు సందర్భాల్లోనూ ఫైనల్ ప్రత్యర్థి పాక్ కావడం విశేషం. దీపావళి పర్వదినాన పాక్‌పై భారత్ విజయం సాధించడంతో ప్రధాని మోడీతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ క్రికెటర్లు సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తదితరులు భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.