
న్యూఢిల్లీ: హాకీ.. కొంతకాలంగా దేశంలో మారుమోగిపోతోన్న స్పోర్ట్. ప్రత్యేకించి- టోక్యో ఒలింపిక్స్ తరువాత హాకీ మళ్లీ పూర్వవైభవాన్ని అందుకుంది. మహిళల కేటగిరీలో హాకీ సెమీఫైనల్స్‌కు చేరడం, పురుషుల విభాగంలో బలమైన జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకోవడం ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు. హాకీ పితామహుడిగా గుర్తింపు పొందిన ధ్యాన్‌చంద్‌కు భారతరత్న అవార్డును అందజేయాలనే డిమాండ్ ఊపందుకుంది అప్పట్లో.
ఈ పరిస్థితుల మధ్య హాకీని జాతీయ జట్టుగా గుర్తించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొట్టివేతకు గురి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ క్రీడను అధికారికంగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలు చేసిన ఈ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇలాంటి ఆదేశాలను జారీ చేయడానికి నిరాకరించింది. హాకీని భారత జాతీయ క్రీడగా ప్రకటించాలంటూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రానికి ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ యు యు లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడి ధర్మాసనం ఈ ప్రజావ్యాజ్యాన్ని విచారించింది. క్రికెట్ వల్ల హాకీ తన ప్రాభవాన్ని కోల్పోతోందని, దాని ప్రతిష్ఠ మసకబారిపోతోందని విశాల్ తివారీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండట్లేదని అన్నారు.
విచారణ ముగిసిన అనంతరం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. దీన్ని కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఇందులో తాము చేయడానికి ఏమీ లేదని, పిటిషనర్ కోరిన విధంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. పిటిషనర్‌పై సానుభూతి ఉందని వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాలపై ప్రజల్లో చైతన్యం రావాలని అభిప్రాయపడింది. విమెన్ బాక్సర్ మేరీకోమ్ వంటి క్రీడాకారులు ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించారని, ఆ స్ఫూర్తి అందరిలో కనిపించాలని పేర్కొంది. బెంచ్ ఆదేశాలతో విశాల్ తివారీ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.