న్యూఢిల్లీ: భారత మహిళా హాకీ కెప్టెన్ నుంచి తనను తప్పించడం పైన రీతూ రాణి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తనను జట్టులోంచి ఎందుకు తీసేశారో చెప్పలేదని వ్యాఖ్యానించింది. చాలాకాలంగా భారత మహిళల హాకీ జట్టుకు కెప్టెన్‌గా తనకు ఒలింపిక్స్‌కు వెళ్లే జట్టులో చోటు కల్పించలేదంది.
తనను రియో ఒలింపిక్స్‌కు ఎంపిక చేయలేదనే వార్త విని షాకయ్యానని చెప్పింది. ఫిట్‌నెస్, ప్రవర్తన సమస్యలు ఏమీ లేవన్నది. ట్రెయినింగ్, క్యాంపులకు నేను గైర్హాజరు కాలేదని తెలిపింది. క్యాంపుకు బ్రేక్ ఇచ్చినప్పుడే తన ఎంగేజ్‌మెంట్ అయిందని తెలిపింది.
జట్టులో నుంచి తీసివేయడంతో తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా చాలా బాధపడ్డాడని తెలిపింది. వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న పురుషుల హాకీ జట్టు ప్లేయర్ సర్దార్ సింగ్‌ను కెప్టెన్ పదవి నుంచి తొలగించినా, జట్టులో ఉంచారని చెప్పింది. తనను మాత్రం ఏకంగా జట్టులో నుంచే తీసేసారని పేర్కొంది.

తనకు ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నించింది. తన పైన అసత్య ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్ మ్యాచులను తాను ఇప్పుడు టవీలో చూడాల్సి వస్తుందని ఊహించలేదని అన్నది. ఇన్నాళ్లు ఆడిన ఆట అంతా వృథా అయిపోయిందని చెప్పింది.
కాగా, గత కొంతకాలంగా రీతూ ప్రదర్శనతో పాటు ప్రవర్తన బాగా లేదనే కారణంతో వేటు వేసినట్లుగా చెబుతున్నారు. రీతూ రాణీ స్థానంలో సుశీల్ చానును కెప్టెన్‌గా నియమించారు.