
హైదరాబాద్: అంతర్జాతీయ సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ఎల్జీబీటీ కమ్యూనిటీకి అండగా నిలబడాలని పెర్త్ హాకీ ఆటగాళ్లు వినూత్నంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా వారు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఆటలో హోమోఫోబియాకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో నగ్నంగా క్యాలెండర్లకు ఫోజులిచ్చారు. సమాజంలో స్వలింగ సంపర్కులపై ఎంతో వివక్ష నెలకొందని, వారు ఎన్నో రకాలుగా దూషణలు ఎదుర్కొంటున్నారని, దీనికి వ్యతిరేకంగా తాము నిలబడాలని నిర్ణయించామని ద పెర్త్ పైథాన్ హాకీ జట్టు ఆటగాడు రీడ్ స్మిత్ తెలిపాడు.
పెర్త్ పైథాన్ పురుష జట్టుతోపాటు ఆస్ట్రేలియా జాతీయ జట్టు ఆటగాళ్లు కూడా ఈ నగ్న ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. హాకీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడంతోపాటు హోమోఫొబియోకు వ్యతిరేకంగా నిలబడేందుకు తాము ఫొటోషూట్‌లో పాల్గొన్నామని వారు తెలిపారు.
పెర్త్‌లోని స్వాన్‌బౌర్న్ బీచ్‌లో ఉదయంపూట ఈ నగ్న ఫోటోషూట్‌లో పాల్లొన్నారు. ఈ నగ్న ఫోటోషూట్‌లో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు చెందిన ఆటగాళ్లు గాబీ నాన్సీ, టామ్ గ్రైగ్, డాల్యన్ వర్త్‌స్పూన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాల్యన్ వర్త్‌స్పూన్ మాట్లాడుతూ వ్యక్తిగత సెక్స్ అనేది వారి ఆటపై ఎంతమాత్రం ప్రభావం చూపదని అన్నారు.
యువ ఆస్ట్రేలియన్ హాకీ ప్లేయర్‌గా ఈ ప్రాజెక్టుకు మద్దతు తెలుపుతున్నందకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. నవంబర్ 23న హాకీ ఆటగాళ్ల నగ్న క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు.