

హైదరాబాద్: భారత్ ఆతిథ్యమిస్తోన్న హాకీ వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 16 జట్ల మధ్య 19 రోజుల పాటు జరిగే ఈ హాకీ వరల్డ్‌కప్‌కు మంగళవారం తెరలేవనుంది. హాకీ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వడం భారత్‌కిది మూడోసారి. తొలిసారిగా 1994లో ముంబయి వేదికగా జరిగిన టోర్నీలో భారత్ ఐదోస్థానంలో నిలిచింది.
ఆ తర్వాత 2010 ఢిల్లీ వేదికగా ఎనిమిదోస్థానంతో సరిపెట్టుకుంది. 19 రోజుల పాటు జరిగే టోర్నీలో 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి 36 మ్యాచుల్లో తలపడనున్నాయి. తొలి రోజైన మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమాలు మాత్రమే జరుగుతుండగా.... బుధవారం నుంచి అసలు సమరానికి తెరలేవనుంది.
హాకీ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవ నేపథ్యంలో భువనేశ్వర్‌లో విద్యా సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 1.30 వరకే పని చేయనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ తారలు కనువిందు చేయబోతున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్, మాధురీ దీక్షిత్ తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించబోతున్నారు. ఈ వరల్డ్ కప్‌కు ఒలీ (ఒలివ్ రిడ్లే సముద్ర తాబేలు)ని అధికారిక చిహ్నంగా ప్రకటించారు. ఒడిషాలోని రుషికుల్య, గహిర్‌మాత బీచ్‌లు ఈ అరుదైన తాబేళ్లు పుట్టినిల్లు.
ఇదిలా ఉంటే, హాకీ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు ఇది మూడోసారి. 1982 (ముంబయి), 2010 (ఢీల్లీ)లో కూడా మన దేశంలో ఈ కప్ జరిగింది. ఈ టోర్నీలో 1975లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు ఇదే సరైన సమయం. ఈ హాకీ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు మన్‌ప్రీత్‌సింగ్ సారథ్యం వహిస్తున్నాడు.