హైదరాబాద్: మంగళవారం... భారత హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు. హాకీలో భారత్‌కు అద్భుత విజయాలు అందించి, భారత పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడించిన ఆయన జయంతిని భారత ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకోవడం ఎప్పటినుంచో అనవాయితీగా వస్తోంది.
ధ్యానచంద్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు మంత్రులు, క్రీడాకారులు శుభాకాంక్షలు తెలిపారు. 'నేషనల్ స్పోర్ట్స్ డే నాడు క్రీడాకారులకు, క్రీడలపై అమితాసక్తి ఉన్నవారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉండి అద్భుతాలు సృష్టించిన మేజర్ ధ్యాన్‌చంద్‌కి నివాళులర్పిస్తున్నాను. భారత్ బలమైన క్రీడా దేశంగా ఎదగాలి. ఈ నేపథ్యంలోనే చిన్నారులు, యువతలోని ప్రతిభాన్వేషణ కోసం www.nationalsportstalenthunt.com అనే వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తీసుకువచ్చాం. క్రీడల ద్వారా ఫిజికల్ ఫిట్‌నెస్ సాధించవచ్చు' అని మోడీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
మరోవైపు కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజులు మంగళవారం ఢిల్లీలోని హాకీ స్టేడియంలో మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ధ్యాన్ చంద్ జయంతి రోజునే కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్‌రత్న అవార్డులను క్రీడాకారులకు అందజేస్తుంది.
మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను కూడా బహూకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తారు. ఇక, ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ధ్యాన్‌చంద్ గురించి కొన్ని విషయాలను అభిమానులతో వరుస ట్వీట్లతో షేర్ చేశాడు.
'ప్రతి చిన్నారి మేజర్ ధ్యాన్‌చంద్ గురించి, ఆయన విజయాల గురించి తెలుసుకోవాలి. ఆయన 16 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరారు. 1956లో ఆర్మీకి రిటైర్మెంట్ ప్రకటించారు. జట్టులోని సహచర ఆటగాళ్లను అతన్ని 'చాంద్' అని పిలిచేవారు. ఎందుకంటే చాంద్ అంటే చందమామ. హాకీ ప్రాక్టీసు కోసం అతను చందమామ రాకకోసం ఎదురుచూసేవాడు
అతన్ని ముద్దుగా 'ద విజర్డ్' అని కూడా పిలిచేవారు. 1936లో ఒలింపిక్స్‌లో భాగంగా జర్మనీతో ఆడిన ఫైనల్లో అతను షూస్ తొలగించి మరీ ఆడాడు. అలా ఆ గేమ్‌లో అతడు మూడు గోల్స్ సాధించాడు. మరోసారి నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్వాహకులు ధ్యాన్‌చంద్ చేతిలోని హాకీ స్టిక్‌ని విరిచి అందుల్లో ఏమైనా అయస్కాంతం ఉందా అని పరీక్షించారట.
1936లో బెర్లిన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు భారత్ తరఫున ధ్యాన్‌చంద్ జాతీయ పతకాన్ని పట్టుకుని భారత జట్టుకి నాయకత్వం వహించాడు. అప్పుడు హిట్లర్‌కి సెల్యూట్ చేసేందుకు నిరాకరించాడు. మన ధ్యాన్‌చంద్ అంతటి ధైర్యవంతుడు. ఆ ఒలింపిక్స్‌లో బెర్లిన్ పట్టణం అంతా ధ్యాన్‌చంద్ పోస్టర్లే వెలిశాయి. హాకీ మైదానానికి తరలిరండి. భారత మాంత్రికుడు ధ్యాన్‌చంద్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించండి అని పోస్టర్లో పేర్కొన్నారు.
క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ సైతం ఓసారి ధ్యాన్‌చంద్ గురించి 'క్రికెట్‌లో పరుగులు రాబడుతున్నట్లు గోల్స్ సాధిస్తున్నాడు. అతని గురించి అందరికీ తెలియాలి. అతను సాధించిన విజయాలతో పండగ చేసుకోవాలి' అని అన్నాడని సెహ్వాగ్ తెలిపాడు.