న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల రాష్ట్రస్థాయి హాకీ క్రీడాకారిణి కరిష్మా సోన్‌కర్ అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆమెను పోలీసులు ప్రియుడితో కలిసి గుర్తించారు. కరిష్మా ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఫరూఖాబాద్ జిల్లాలో ప్రియుడు శివమ్ కటారియాతో కలసి ఉన్న బాలికను పోలీసులు పట్టుకున్నారని జిల్లా ఎస్పీ సోనియా సింగ్ తెలిపారు.
అయితే బాలిక తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి సుముఖంగా లేదని చెప్పారు. బాలిక తాను మేజర్‌నని, శివమ్‌తో కలసి ఉండాలనుకుంటోందని చెప్పిందని పోలీసులు తెలిపారు. బరేలీ జీఆర్పీ వద్ద తప్పిపోయిన కేసు రిజిష్టరైనందున బాలికను వారికి అప్పజెబుతామన్నారు.

రాంచిలో జరిగిన అండర్-17 జాతీయ హాకీ టోర్నీలో పాల్గొన్న అనంతరం బరేలి తిరుగు ప్రయాణంలో ఆ హాకీ ప్లేయర్ ఆచూకీ తెలియకుండా పోయన విషయం తెలిసిందే. ఈ నెల 7న జలియన్‌వాలా బాగ్ ఎక్స్‌ప్రెస్‌లో రాంచి నుంచి కోచ్ రాహుల్ సింగ్‌తోపాటు బయల్దేరిన ప్లేయర్లందరూ ఫైజాబాద్‌లో దిగిపోయారు.
అక్కడ నుంచి సొంత ఊరు బరేలికి బయల్దేరిన కరిష్మా ఈ నెల 10 వరకు ఇంటికి చేరలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారుపడి పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రులు కోచ్ పైన నిందలు వేశారు. దీనిని కోచ్ కూడా ఖండించారు.
చివరిసారిగా బారాబంకి నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పిందని కరిష్మా కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ డేటా ఆధారంగా బాలిక వారిని తప్పుదోవ పట్టించి విషయం కనుగొన్నారు. గాలింపు చేపట్టి క్రీడాకారిణి ఆచూకీ కనుగొన్నారు.