కోల్‌కతా: ఐపీఎల్ 8 కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఔదార్యం ప్రదర్శించాడు. కువైట్‌లో ఈ నెలాఖరులో జరగనున్న ఐస్ హాకీ ఆసియా ఛాలెంజ్ కప్‌కు వెళ్లేందుకు డబ్బుల్లేక అవస్థలు పడుతున్న భారత ఐస్ హాకీ జట్టుకు అతడు బాసటగా నిలిచాడు. కువైట్ పర్యటనకు సంబంధించి ఐస్ హాకీ జట్టుకు నాలుగు లక్షల రూపాయలను అందజేశాడు.
కువైట్ ఛాలెంజ్ కప్‌కు వెళ్లేందుకు ఐస్ హాకీ జట్టు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తమకు ఆర్థికంగా సాయం చేయాలని ఆటగాళ్లు వివిధ రూపాల్లో విజ్ఞప్తి చేశారు. రేడియోలో, సోషల్ మీడియాలో వారు విజ్ఞప్తి చేశారు.
గౌతమ్ గంభీర్ వారి విజ్ఞప్తిని రేడియో ద్వారా విన్నాడు. వెంటనే స్పందించాడు. వారికి గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ (జీజీఎఫ్) ద్వారా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించాడు.

దీనిపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న క్రీడా జట్టును ఆదుకోవాలన్న నైతిక బాధ్యతతో తాను దీనిని డొనేట్ చేస్తున్నానని చెప్పాడు. భారత దేశంలో ఆటలకు ఇలాంటి దుస్థితి రావడం తనను బాధిస్తోందన్నాడు. ఆటలకు బాగా ఆదరణ ఉన్న భారత్‌లో ఇలాంటి ఇబ్బందులు బాధాకరమన్నాడు. ఓ ఆటగాడిగా.. చిన్న ఆటలకు కూడా తాను మద్దతిస్తానని, అది తన నైతిక బాధ్యత అన్నాడు.
ఐస్ హాకీ జట్టు సారథి సేవాంగ్ గ్యాల్ట్‌సోన్ మాట్లాడుతూ.. తమకు మంచి మద్దతు లభించిందని, ఛాంపియన్‌షిప్‌లో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. తొలిసారి తమకు మంచి మద్దతు లభించిందన్నాడు. ఐస్ హాకీ కూడా ప్రాధాన్యత పెరుగుతోందన్నాడు.
తాము బాగా ప్రాక్టీస్ చేశామని, ఛాలెంజ్ కప్ పైన విశ్వాసంతో ఉన్నామన్నాడు. తాను ఐస్ హాకీ వైపు మొగ్గు చూపితే, చాలామంది భవిష్యత్తు ఉండది.. వద్దని చెప్పారని, చదువు పైన దృష్టి సారించమని సూచించారని గుర్తు చేసుకున్నాడు. కానీ తాను మాత్రం ఈ ఆట పై ప్రేమతో దీనిని కొనసాగించానని చెప్పాడు.