Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చ‌క్‌దే ఇండియా! మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు ఖాతాలో అనూహ్య విజ‌యం

Indian Womens Hockey Team Beats Chile, Secures Berth in Olympic Qualifiers Final Round

హిరోషిమా: భార‌త మ‌హిళా హాకీ జ‌ట్టు అనూహ్య విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. చ‌క్‌దే ఇండియా టైప్ గెలుపు ఇది. ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ టోర్నమెంట్‌కు అర్హ‌త సాధించాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో అంద‌రి అంచ‌నాల‌కు మించి రాణించింది మ‌హిళా హాకీ జ‌ట్టు. అద్భుత విజ‌యాన్ని అందుకుంది. టోక్యోలో జ‌రిగబోయే ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించింది.

జ‌పాన్‌లోని హిరోషిమాలో నిర్వ‌హిస్తోన్న మహిళా హాకీ సిరీస్ టోర్న‌మెంట్ మ్యాచ్‌లో భార‌త హాకీ జ‌ట్టు చిలీపై విజయం సాధించింది. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌ బెర్త్‌ను హ‌స్త‌గ‌తం చేసుకుంది. శనివారం జ‌రిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 4-2 గోల్స్‌ తేడాతో బ‌ల‌మైన చిలీ జ‌ట్టును ఓడించింది. భారత్‌ తరపున గుర్జిత్‌ కౌర్ రెండు గోల్స్ చేశారు. ఆట ఆరంభ‌మైన 22, 37వ నిమిషంలో ఆమె మెరుపులాంటి గోల్స్ కొట్టారు. మ‌రో క్రీడాకారిణి నవ్‌నీత్‌ కౌర్ 31వ నిమిషంలో గోల్ సాధించి జ‌ట్టును ఆధిక్యంలో నిల‌బెట్టారు. ఫార్వ‌ర్డ్ క్రీడాకారిణి రాణి రాంపాల్ 57వ నిమిషంలో సాధించిన గోల్‌తో ఆధిక్యాన్ని మ‌రింత మెరుగుప‌ర్చుకుంది హాకీ జ‌ట్టు. కాగా- చిలీ తరపున కరోలినా, ఉరోజ్‌ చెరో గోల్‌ చేశారు.

ఆట ఆరంభంలో చిలీ క్రీడాకారిణులు దూకుడుగా ఆడారు. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. భార‌త క్రీడాకారిణుల‌ను ఎక్క‌డికక్క‌డ అడ్డుకున్నారు. ఎక్కువ సేపు బాల్ త‌మ ఆధీనంలో ఉండేలా చూసుకున్నారు. భార‌త గోల్ పోస్ట్‌పై ప‌దే ప‌దే దాడులు చేశారు. 18వ నిమిషంలో కరోలినా చిలీ ఫార్వ‌ర్డ్ క్రీడాకారిణి గార్సియా గోల్ సాధించింది. ఆ వెంట‌నే తేరుకున్న భారత జ‌ట్టు క్రీడాకారిణులు ఎదురుదాడికి దిగారు. తొలి గోల్ సాధించిన ఆనందాన్ని ఎక్కువ సేపు నిల‌వ‌నీయ‌లేదు భార‌త ఫార్వ‌ర్డ్ క్రీడాకారిణి గుర్జిత్ కౌర్‌. ఆట 22వ నిమిషంలో చిలీ డిఫెన్స్‌ను ఛేదిస్తూ, కీప‌ర్‌ను బోల్తా కొట్టిస్తూ ఆమె గోల్ సాధించారు.

గోల్ కొట్టే డ్యూటీ అందుకున్న న‌వనీత్ కౌర్‌..

మ‌రో తొమ్మిది నిమిషాల్లోనే భార‌త్‌.. మ‌రో గోల్‌ను సాధించింది. ఆట 31వ నిమిషంలో డిఫెన్స్ క్రీడాకారిణి న‌వనీత్ కౌర్ గోల్ సాధించారు. గుర్జీత్ కౌర్ నుంచి అందిన పాస్‌ను ఆమె గోల్‌గా మ‌లిచిన తీరు అద్భుతం అనిపించుకుంది. త‌న‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన చిలీ ఆట‌గాళ్లను మాయ చేస్తూ, బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించారు. దీనితో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఆట 37వ నిమిషంలో గుర్జీత్ కౌర్ మరో గోల్‌ను న‌మోదు చేశారు. దీనితో ఆధిక్య‌త 3-1తో నిలిచింది. ఇక తిరుగులేద‌నుకున్న ద‌శ‌లో చిలీ ఆట‌గాళ్లు పోరాట ప‌టిమ‌ను క‌న‌ప‌ర్చారు.

43వ నిమిషంలో ఉరోజ్ గోల్‌ సాధించారు. ఆధిక్యాన్ని 3-2కు తగ్గించారు. దీనితో భార‌త జ‌ట్టు డిఫెన్స్ ఆడ‌టానికి ప్రాధాన్య‌త ఇచ్చింది. మ‌రి కాస్సేప‌ట్లో మ్యాచ్ ముగుస్తుంద‌న‌గా రాణి రాంపాల్ అనూహ్యంగా గోల్ సాధించారు. భారత విజయాన్ని ఖాయం చేశారు. ఆదివారం భారత్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆతిథ్య జ‌పాన్ జ‌ట్టును ఢీ కొట్ట‌బోతోంది.

Story first published: Sunday, June 23, 2019, 13:11 [IST]
Other articles published on Jun 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+