
ముంబై: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న 2022 కామన్వెల్త్ క్రీడల్లో హాకీ పోటీల నుంచి భారత్ తప్పుకుంది. కామన్‌వెల్త్ క్రీడలకు పురుషుల, మహిళల జట్లను పంపించకూడదని హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం నిర్ణయించింది. బ్రిటన్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కారణంగా కామన్‌వెల్త్ క్రీడలకు దూరంగా ఉండనున్నట్లు మంగళవారం భారత హాకీ సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. బర్మింగ్‌హామ్ వేదికగా వచ్చే ఏడాది జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్‌వెల్త్ 2022 క్రీడలు జరుగుతాయి. ఇక కామెన్‌వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్న భారత హాకీ జట్లు ఏషియన్ గేమ్స్‌పై దృష్టిసారించనున్నాయి.
చైనాలో ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జరగనున్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ మధ్య వ్యవధి 32 రోజులే ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో భారత క్రీడాకారులను రిస్క్‌లో పెట్టలేమని హాకీ ఇండియా ప్రెసిడెంట్ గ్యానెండ్రో నింగోంబామ్ తెలిపారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరిందర్ బాత్రాతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భారత పురుషులు, మహిళల హకీ జట్లు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బెర్తును ఖరారు చేసుకోవాలంటే.. ఆసియా క్రీడల్లో రాణించాల్సి ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు కాంస్య పతకం సాధించగా.. మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈసారి 2022 కామన్‌వెల్త్, ఆసియా క్రీడలకు మధ్య వ్యవధి కేవలం 32 రోజులు మాత్రమే ఉంది. అంతేకాకుండా కామన్‌వెల్త్ క్రీడలు జరిగే బ్రిటన్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుండటంతో.. జట్లను పంపించేందుకు హాకీ ఇండియా సుముఖత వ్యక్తం చేయలేదు. యూకే నిబంధనల ప్రకారం.. గేమ్స్ కోసం వెళ్లిన వారు అక్కడ 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అంతేకాకుండా ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం భారత్‌లోని కరోనా వ్యాక్సినేషన్ ధ్రువ పత్రాలను అంగీకరించేందుకు నిరాకరించింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ.. 10 రోజుల కఠినమైన క్వారంటైన్‌ను పాటించాల్సి ఉంటుంది. దాంతో టోర్నీకి వెళ్లకపోవడమే మేలని హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
భారత కరోనా టీకాలను గుర్తించేందుకు ఇటీవల నిరాకరించిన యూకే.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. అందుకు బదులుగా భారత్ కూడా యూకే పౌరులపై ఆంక్షలు విధించింది. భారత్ వచ్చే యూకే పౌరులకు పది రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో వచ్చే నెలలో ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ ప్రపంచకప్ నుంచి ఇంగ్లండ్ తప్పుకుంది. తాజాగా 2022 కామన్‌వెల్త్ నుంచి తప్పుకున్నట్టు భారత్ ప్రకటించడం గమనార్హం.