
అద్భుత విజయం..
క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో భారత్ అత్యద్భుతంగా ఆడింది. విమెన్ హాకీ ప్లేయర్ల గ్రౌండ్‌లో పాదరసంలా కదిలారు. గ్రూప్ దశలో సాధించిన వరుస విజయాల దూకుడును ఇక్కడా కొనసాగించారు. ప్రత్యర్థులను కట్టడి చేయడానికి పక్కాగా రూపొందించుకున్న వ్యూహాలను అదే స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఎక్కడే గానీ పొరపాట్లకు అవకాశం ఇవ్వలేదు.. తడబడనూ లేదు. బలమైన ఆస్ట్రేలియా జట్టు ముందు తలవంచడానికి సిద్ధపడలేదు. తొలి రెండు క్వార్టర్లు ముగిసే వరకు ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించలేదంటే- ఈ రెండూ ఎంతగా పోరాడాయో అర్థం చేసుకోవచ్చు.

గ్రూప్ దశలో మూడు ఓటములు..
నిజానికి- రాణి రాంపాల్ టీమ్ గ్రూప్ దశలోనే వెనుదిరగాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల వేట నాసిరంగా ప్రారంభమైంది. పూల్-ఏలో మొదట్లో వరుస ఓటములను చవి చూసింది జట్టు. అయిదింట్లో మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఈ దశలో భారత మహిళా హాకీ జట్టు కోలుకుంటుందని ఎవరూ ఊహించలేదు.. సెమీ ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టిస్తుందని భావించలేదు. అందరి అంచనాలను తలకిందులు చేసింది టీమ్. సమష్టిగా రాణించింది. సత్తా చాటింది. మెరుపుల్లాంటి పాసింగ్స్‌తో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

పరాజయాల హ్యాట్రిక్..
ఈ టోర్నమెంట్‌లో భారత్ తాను ఎదుర్కొన్న తొలి మూడు మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవి చూసింది. తొలి మ్యాచ్‌లో మరీ ఘోరం. నెదర్లాండ్స్‌పై ఏకంగా 5-1 గోల్స్ తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. రెండో మ్యాచ్‌లో జర్మనీ టీమ్.. భారత్‌పై అన్ని రంగాల్లో పైచేయి సాధించింది. 2-0 గోల్స్ తేడాతో ఆ మ్యాచ్‌ను ఎగరేసుకెళ్లింది. మూడో ఓటమి కూడా భారత్‌ను పలకించింది. గ్రేట్ బ్రిటన్ చేతిలో 4-1 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ దశలో జట్టు కోలుకుంటుందని బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.

మలుపు తిప్పిన ఆ రెండు మ్యాచ్‌లు..
నాలుగో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 1-0 గోల్స్‌తో విజయం సాధించడం జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఆటతీరును మళ్లీ గాడిన పడేలా చేసింది. విజయాన్ని సాధించాలనే కసిని, కాంక్షను రేపినట్టయింది. అదే ఊపుతో గ్రూప్ దశలో అయిదో మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది రాణి రాంపాల్ టీమ్. ఆ మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాను ఓడించింది. 4-3 గోల్స్ తేడాతో పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. ఇక క్వార్టర్ ఫైనల్స్ ప్రస్థానం ఎలా ముగిసిందో తెలిసిన విషయమే. ఆస్ట్రేలియాను ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు భారత్. గుర్జీత్ కౌర్ సాధించిన గోల్‌తో మ్యాచ్‌ను తన వశం చేసుకుంది. సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది.

ఆస్ట్రేలియా భిన్నం..
భారత్‌కు భిన్నంగా ఉంది ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టు ప్రస్థానం. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్‌ను కూడా ఓడిపోలేదు ఆసీస్. అయిదుకు అయిదింటినీ తన ఖాతాలో వేసుకోగలిగింది. తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌పై 3-1, రెండో మ్యాచ్‌లో చైనాపై 6-0తో తిరుగులేని విజయాన్ని అందుకుంది. మూడో మ్యాచ్‌లో లోకల్ టీమ్ జపాన్ దుమ్ము దులిపింది. నాలుగో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 1-0, అయిదో మ్యాచ్‌లో అర్జెంటీనాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఇదే అర్జెంటీనా ఇప్పుడు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ జట్టును ఢీ కొట్టాల్సి ఉంది భారత్. ఇప్పుడున్న ఊపు కొనసాగితే- సెమీస్‌లో కూడా విజయం సునాయాసం కావడానికే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
