Chack De: సవిత..ఓ అద్భుతం: ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి సెమీస్‌కు భారత మహిళల హాకీ జట్టు

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 11వ రోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. మహిళల 200 మీటర్ల హీట్‌లో పరాజయాన్ని చవి చూసినప్పటికీ.. దాన్ని మరిచిపోయేలా చేసింది భారత మహిళల హాకీ జట్టు. పురుషుల జట్టుతో సమానంగా పోరాడింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. సెమీ ఫైనల్స్‌లోకి దర్జాగా అడుగు పెట్టింది.. రాణి రాంపాల్ టీమ్. ఇంకొక్క విజయం చాలు.. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని ముద్దాడటానికి. చివరి వరకు ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగిందీ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో భారత్ విజయ దుందుభి మోగించింది.
అద్భుత విజయం..
క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో భారత్ అత్యద్భుతంగా ఆడింది. విమెన్ హాకీ ప్లేయర్ల గ్రౌండ్‌లో పాదరసంలా కదిలారు. గ్రూప్ దశలో సాధించిన వరుస విజయాల దూకుడును ఇక్కడా కొనసాగించారు. ప్రత్యర్థులను కట్టడి చేయడానికి పక్కాగా రూపొందించుకున్న వ్యూహాలను అదే స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఎక్కడే గానీ పొరపాట్లకు అవకాశం ఇవ్వలేదు.. తడబడనూ లేదు. బలమైన ఆస్ట్రేలియా జట్టు ముందు తలవంచడానికి సిద్ధపడలేదు. తొలి రెండు క్వార్టర్లు ముగిసే వరకు ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించలేదంటే- ఈ రెండూ ఎంతగా పోరాడాయో అర్థం చేసుకోవచ్చు.
మూడో క్వార్టర్‌లో..
మూడో క్వార్టర్‌లో భారత్ గోల్ సాధించింది. 22వ నిమిషంలో గుర్జీత్ కౌర్ గోల్ చేశారు. తనకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఆమె గోల్‌గా మలచడంలో సక్సెస్ అయ్యారు. గుర్జీత్ కౌర్ కొట్టిన షాట్‌కు బంతి బుల్లెట్ కంటే వేగంతో గోల్ పోస్ట్ వైపు పరుగులు తీసింది. నాలుగో క్వార్టర్‌లో భారత్ కూడా గోల్ సాధించలేకపోయినప్పటికీ- తన ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు మాత్రం ఎలాంటి అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. నిర్ణయాత్మకమైన, మ్యాచ్ ఫలితాన్ని శాసించే నాలుగో క్వార్టర్‌లో భారత్ చాలా వరకు బంతిని తన ఆధీనంలోనే ఉంచుకోగలిగింది. ఆస్ట్రేలియా అటాకర్స్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించింది.
సవిత.. అద్భుతం..
ఈ విజయంలో భారత గోల్ కీపర్ సవిత పాత్ర కీలకం. ఓ అద్భుతాన్ని ఆవిష్కరింపజేశారామె. ఆస్ట్రేలియాకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ.. ఏ ఒక్క దాన్ని కూడా గోల్ చేయనివ్వకుండా అడ్డుకోగలిగారంటే సవిత ఏ స్థాయిలో పెర్‌ఫార్మెన్స్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఒకదాని వెంట ఒకటిగా వచ్చిన పెనాల్టీ కార్నర్ షాట్లను సవిత సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకోగలిగారు. ఆ తరువాత కూడా ఓపెన్ ప్లే లో ఆస్ట్రేలియా ప్లేయర్లు గోల్ పోస్ట్‌పై చేసిన దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నారు. అందుకే- బలమైన ఆస్ట్రేలియా జట్టు ఒక్క గోల్‌ను కూడా చేయలేకపోయింది ఈ గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో.
రాణి రాంపాల్.. చరిత్ర
రాణి రాంపాల్ సారథ్యంలోని భారత మహిళా హాకీ జట్టు ఈ టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన విజయాలు.. పూర్వ వైభవాన్ని గుర్తు చేశాయి. రాణి కేప్టెన్సీలో గుర్జీత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, ఉదిత, నిషా, నేహా, మోనికా, నవ్‌జోత్ కౌర్, నవ్‌నీత్ కౌర్, వందన కఠారియా ఒక్కొక్కరు ఒక్కో గోడలా కనిపించి ఉండొచ్చు ఆస్ట్రేలియా జట్టుకు. పాదరసంలా కదులుతూ.. మెరుపుల్లా బంతిని పాస్ చేసుకుంటూ- బంతిని ఎక్కువ భాగం తమ ఆధీనంలోనే ఉంచుకున్న తీరు.. జట్టుకు తిరుగు లేదనిపించేలా చేసింది. సెమీ ఫైనల్‌లో భారత జట్టు మరో బలమైన టీమ్‌ను ఢీ కొట్టబోతోంది. అదే అర్జెంటీనా. అర్జెంటీనాతో తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications