Hockey Asia cup 2025: ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆసియా కప్ ఫైనల్‌లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత టైటిల్ కైవసం చేసుకుంది. బీహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా సౌత్ కొరియాతో జరిగి పోరులో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత హాకీ జట్టు వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ పోరుకు కూడా అర్హత సాధించింది. భారత జట్టు నాలుగో సారి ఆసియా కప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు అజేయంగా ఫైనల్‌కు చేరుకోగా.. ఫైనల్ మ్యాచ్‌లో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ముందు 5 సార్లు ఆసియా ఛాంపియన్ అయిన దక్షిణ కొరియా ఓటమిపాలైంది. టీమిండియా ఇంతకు ముందు 2003, 2007, 2017లో విజేతగా నిలిచింది. భారత్ 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తొలి నిమిషంలోనే గోల్ చేసిన సుఖ్‌జీత్ సింగ్
హర్మన్‌ప్రీత్ సింగ్ మొదటి నిమిషంలోనే సుఖ్‌జీత్‌కు ఒక పాస్ ఇచ్చాడు. దక్షిణ కొరియా జట్టు తమ డిఫెన్స్‌ను సర్దుకునేలోపే భారత్ గోల్ సాధించింది. ఆ తర్వాత 7వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ ముందు దక్షిణ కొరియా ఆటగాడు ప్రమాదకరంగా హాకీ స్టిక్‌ని తిప్పడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. అయితే జుగ్‌రాజ్ సింగ్ గోల్ చేయడంలో విఫలమయ్యాడు. భారత్ ఆధిక్యం 1-0 గానే ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత ఆధిపత్యం కొనసాగింది. 28, 45వ నిమిషాల్లో దిల్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించాడు. చివరకు 50 నిమిషంలో అమిత్ రోహిదాస్ చివరి గోల్ కొట్టి భారత్ కు గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో దక్షిణ కొరియా జట్టు డిఫెన్స్‌కు పరిమితమైంది. సౌత్ కొరియాకు మొదటి గోల్ 51వ నిమిషంలో లభించిన కార్నర్ ద్వారా వచ్చింది. సన్ డయాన్ బంతిని రిఫ్లెక్ట్ చేసి టీమిండియా డిఫెన్స్‌ను ఛేదించాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. మ్యాచ్ 4-1తో భారత్‌కు అనుకూలంగా ముగిసింది.

ఆసియా కప్ విజేతల వివరాలు ఇలా..
మొదటి 4 ఆసియా కప్‌ల ఫైనల్స్‌కు చేరిన భారత జట్టు తొలిసారి టైటిల్‌ను 2003లో గెలుచుకుంది. అంతకుముందు మొదటి 3 ఆసియా కప్‌ల ఫైనల్స్‌లో టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. అలాగే 1994లో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. కొరియా 1999లో కూడా టైటిల్ గెలిచి పాకిస్తాన్‌ను ఓడించింది. 2003, 2007లో భారత్ వరుసగా 2 టైటిల్స్ గెలుచుకుంది. 2009, 2013లో కొరియా కూడా ఛాంపియన్‌గా నిలిచింది. 2017లో టీమిండియా గెలుచుకుంది. 2022లో సౌత్ కొరియా టైటిల్ సాధించింది. 2025లో టీమ్ ఇండియా నాలుగోసారి ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది.