
ఢాకా: పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2021లో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. నేడు మూడో స్థానం కోసం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ మెత్తం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడడంతో ఫలితం కోసం చివరి వరకు ఉత్కంఠ తప్పలేదు. ఇరు జట్లు గోల్స్ సాధించడానికి, ప్రత్యర్థి జట్టు గోల్స్‌ను ఆపడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. దీంతో అద్యాంతం హోరాహోరిగా సాగిన ఈ పోరులో చివరకు భారత జట్టునే విజయం వరించింది.
మ్యాచ్ ప్రారంభమైన ఆరంభంలోనే పాకిస్థాన్ గోల్స్ కోట్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా వరుసగా దాడి చేసింది. దీంతో భారత్‌కు వరుసగా ఫెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో 11వ నిముషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ సాధించి భారత్‌ను 1-0తో అధిక్యంలోకి తీసుకెళ్లాడు. అనంతరం మ్యాచ్ 33వ నిముషంలో పాకిస్థాన్ ప్లేయర్ అబ్దుల్ రానా గోల్ సాధించి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. అనంతరం పాక్ మరో గోల్ సాధించి 2-1తో అధిక్యంలోకి దూసుకెళ్లింది.
అయితే ఈ క్రమంలో భారత్ మళ్లీ పుంజుకుంది. 53వ నిమిషంలో వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అప్పుడు టీమిండియా 3-2తో అధిక్యంలో నిలిచింది. ఇంతలోనే మ్యాచ్ 57వ నిమిషంలో ఆకాశ్‌దీప్ గోల్ సాధించడంతో భారత్ అధిక్యం రెండింతలు అయింది. అయితే పాకిస్థాన్ మరో గోల్ చేసినప్పటికీ అప్పటికే ఆ జట్టుకు నష్టం జరిగిపోయింది. చివరికి టీమిండియా 4-3తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో ఓడి ఫైన్‌ల్ చేరే అవకాశం కోల్పోయినప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచి భారత జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, వరుణ్ కుమార్, ఆకాశ్‌దీప్ సింగ్ గోల్స్ చేయగా.. పాకిస్థాన్ తరఫున అర్ఫ్రాజ్, అబ్దుల్ రాణా, నదీమ్ గోల్స్ చేశారు. భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయలేకపోయినప్పటికీ, మిడ్‌ఫీల్డ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
కాగా సెమీస్‌లో టీమిండియా 3-5 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలాగే సెమీస్‌లో పాకిస్థాన్.. దక్షికొరియా చేతిలో 5-6 తేడాతో ఓడిపోయింది. అయితే లీగ్ స్టేజ్‌లోనూ పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. అప్పుడు పాక్‌ను భారత్ 3-1 తేడాతో ఓడించింది. దీంతో ఈ టోర్నీలో పాక్‌పై వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది.