
హైదరాబాద్: మ్యాచ్ చివరి క్షణాల్లో తడబాటుకు గురయ్యే అలవాటును భారత జట్టు పునరావృతం చేసింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన భారత పురుషుల హాకీ జట్టు చివరి రెండు నిమిషాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకొని గెలవాల్సిన మ్యాచ్‌ను చివరకు 'డ్రా'గా ముగించింది.
వివరాల్లోకి వెళితే నెదర్లాండ్స్‌లోని బ్రెడా వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బెల్జియం, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రాగా ముగించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (10వ నిమిషంలో), బెల్జియం తరఫున లొయిక్ ల్యూపార్ట్ (59వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు.
మ్యాచ్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడిన భారత్ పదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత ప్రత్యర్ధి జట్టుపై ఒత్తిడిని పెంచుతూ మ్యాచ్‌లో పైచేయి కనబర్చింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇక, రెండో అర్ధ భాగంలో దాడులు తీవ్రతరం చేసిన బెల్జియం ఆటగాళ్లు బంతిని ఎక్కువ శాతం తమ నియంత్రణలో ఉంచుకున్నారు. దీంతో పలుమార్లు భారత్‌కు గోల్ చేసే అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనే వరకూ భారత్ 1-0తో ఆధిక్యంలోనే ఉంది.
అయితే, 58వ నిమిషంలో బెల్జియం ఆటగాళ్లకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను లొయిక్ లూపార్ట్ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. దీంతో బెల్జియం ఓటమి తప్పించుకుంది. టోర్నీలో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది.