Asia Cup Hockey 2025: బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2025లో భారత హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. భారత జట్టు తమ రెండో పూల్ మ్యాచ్‌లో జపాన్‌ను 3-2 తేడాతో ఓడించి.. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత జట్టు తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(5వ, 46వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా.. మన్‌దీప్ సింగ్ (4వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు.
జపాన్ జట్టు తరఫు కవాబే కోసేయ్(38వ, 59వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు. ఈ మ్యాచ్ భారత గోల్ కీపర్ కృష్ణ బహదూర్ పాఠక్ కెరీర్లో 150వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ విజయం అతని కెరీర్లో ఒక ప్రత్యేక సందర్భాన్ని మరింత ప్రత్యేకం చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కృష్ణ బహదూర్ పాఠక్‌ను సత్కరించారు.

మ్యాచ్ విశేషాలు
భారత జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడి, మొదటి క్వార్టర్‌లోనే రెండు గోల్స్ సాధించింది. నాలుగో నిమిషంలో మన్‌దీప్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేయగా, ఐదో నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసి భారత్‌ను 2-0 ఆధిక్యంలో ఉంచాడు. రెండో క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. మూడో క్వార్టర్‌లో జపాన్ జట్టు అటాకింగ్ గేమ్‌ను ప్రదర్శించింది. క్వార్టర్ 8వ నిమిషంలో కవాబే కోసేయ్ గోల్ చేసి స్కోర్‌ను 2-1కి తగ్గించాడు. నాలుగో క్వార్టర్ మొదలవగానే భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దీనిని హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. జపాన్ జట్టు పోరాటాన్ని కొనసాగిస్తూ, మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాల ముందు కవాబే కోసేయ్ మరో గోల్ చేశాడు. దీంతో స్కోర్ 3-2గా నిలిచింది. చివరి వరకు భారత్ ఆధిక్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది.
భారత జట్టు భవిష్యత్.. ఆసియా కప్ చరిత్ర
ఈ విజయంతో భారత జట్టు తమ గ్రూపులో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు భారత్ తమ చివరి పూల్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 1(సోమవారం) నాడు కజకిస్థాన్‌తో తలపడనుంది. ఈ టోర్నమెంట్ విజేతకు వచ్చే ఏడాది నెదర్లాండ్స్, బెల్జియంలో జరగబోయే హాకీ ప్రపంచ కప్ లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ 17వ ఎడిషన్. భారత జట్టు ఇప్పటి వరకు మూడు సార్లు ఆసియా కప్ గెలుచుకుంది (2003, 2007, 2017). అత్యధికంగా సౌత్ కొరియా ఐదుసార్లు, పాకిస్తాన్ మూడుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాయి. భద్రతా కారణాల వల్ల ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంది.
ఆసియా కప్ కోసం భారత హాకీ జట్టు:
గోల్ కీపర్స్: కృష్ణ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా.
డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్‌రాజ్ సింగ్, సుమిత్, సంజయ్.
మిడ్‌ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, రాజ్ కుమార్ పాల్, హార్దిక్ సింగ్, రాజిందర్ సింగ్.
ఫార్వర్డ్స్: మన్‌దీప్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, అభిషేక్, శిలానంద్ లాక్రా, దిల్‌ప్రీత్ సింగ్.