
ముంబై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న కోసం భారత్ హాకీ మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ పేరును హాకీ ఇండియా ప్రతిపాదించింది. మరోవైపు వందనా కటారియా, మోనికా, హర్మన్‌ప్రీత్ సింగ్‌ను అర్జున పురస్కారాలకు నామినేట్ చేసింది. దిగ్గజ క్రీడాకారులు ఆర్పీ సింగ్, తుషార్ ఖండేకెర్ పేర్లను మేజర్ ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారాలకు ప్రతిపాదించడం గమనార్హం. ఇక కోచ్‌లు బీజే కరియప్ప, రమేశ్ పఠానియాను ద్రోణాచార్య పురస్కారాల కోసం హాకీ ఇండియా ఎంపిక చేసింది.
గత కొంత కాలంగా క్రీడాకారిణి, జట్టు కెప్టెన్‌గా రాణి రాంపాల్ అద్భుతంగా ఆడుతోంది. మహిళల ఆసియా కప్-2017లో విజయాలు, ఆసియా క్రీడలు-2018లో రజతం, 2019లో జరిగిన ఒలింపిక్ అర్హత పోటీల్లో రాంపాల్ విలువైన పాత్ర పోషించింది. రాణి కెప్టెన్సీలోనే జట్టు తొమ్మిదో ర్యాంకుకు చేరుకుంది. 2016లో అర్జున, 2020లో పద్మశ్రీ పురస్కారాలు ఆమెను వరించాయి. ఇక వందన 200, మోనికా 150కి పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. ఒలింపిక్ అర్హత పోటీల్లో కీలకంగా నిలిచారు.
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) సైతం ఖేల్‌రత్న, అర్జున పురస్కారాలకు తమ క్రీడాకారుల పేర్లను నామినేట్ చేసింది. ప్రపంచ రజత పతక విజేత అమిత్ పంఘాల్, కీలకమైన బాక్సర్ వికాస్ కృష్ణన్ పేర్లను ఖేల్‌రత్నకు ప్రతిపాదించింది. ప్రపంచ కాంస్య పతక త్రయం లవ్లీనా బొర్‌గోహైన్ (69 కిలోలు), సిమ్రన్‌జీత్ కౌర్ (64 కిలోలు), మనీశ్ కౌశిక్ (63 కిలోలు)ను అర్జున పురస్కారాలకు నామినేట్ చేసింది.
భారత మహిళల బాక్సింగ్ కోచ్ మహ్మద్ అలీ ఖమర్, సహాయ కోచ్ చోటెలాల్ యాదవ్ పేర్లను ద్రోణాచార్యకు పంపించింది. ధ్యాన్‌చంద్ జీవిత కాల సాఫల్య పురస్కారం కోసం మాజీ విజేత ఎన్.ఉష పేరును నామినేట్ చేసింది. ఖేల్‌రత్న కోసం రోహిత్ శర్మ.. అర్జున కోసం శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ పేర్లను బీసీసీఐ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని సంఘాలు క్రీడాకారుల పేర్లను పంపించేందుకు జూన్ 3 చివరి తేదీ. బుధవారంతో గడువు ముగియనుంది.