
హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్‌లో భారత హాకీ జట్టు మరో కీలకపోరుకు సిద్ధమైంది. పూల్ 'సి'లో శనివారం భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్, మలి మ్యాచ్‌లో మెరుగైన బెల్జియంను నిలువరించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శనివారం కెనడాతో తలపడుతుంది. ఇందులో గెలిస్తే పూల్ టాపర్‌గా టీమిండియా నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. ఇదే పూల్‌లో రియో ఒలింపిక్స్ రన్నరప్ బెల్జియంతోపాటు 4 పాయింట్లతో ఉన్నప్పటికీ, గోల్స్ పరంగా భారతే అగ్రస్థానంలో ఉంది. మరోవైపు కెనడా ఒక పాయింట్‌తో ముడోస్థానంలో ఉంది.
అయితే ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం క్వార్టర్స్ కోసం క్రాస్ ఓవర్ నాకౌట్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మరోవైపు పూల్‌లో చివరి స్థానం ఉన్న జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ముఖాముఖి పోరులో కెనడాతో భారత్‌కు మంచి రికార్డే ఉంది. 2013 నుంచి ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా... మూడు భారత్ గెలిస్తే, ఒక్కటి మాత్రమే కెనడా నెగ్గింది.
మరో మ్యాచ్ 'డ్రా' అయింది. దీంతో సొంతగడ్డపై జరుగుతున్న మెగా ఈవెంట్‌లో సత్తా చాటాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. అలాగనీ తమ(5) కంటే తక్కువ(11) ర్యాంక్‌లో ఉన్న కెనడాను తక్కువ అంచనా వేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయద్దన్న ఆలోచనతో మన్‌ప్రీత్‌సింగ్ సేన ఉంది.
ఫార్వర్డ్‌లో మన్‌దీప్ సింగ్, సిమ్రన్‌జిత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్‌లు బాగా ఆడుతున్నారు. మిడ్ ఫీల్డ్‌లో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఫామ్‌లో ఉన్నప్పటికీ డిఫెన్స్ ఒత్తిడే జట్టును కలవరపెడుతోంది. మ్యాచ్ ముగిసేదశలో అనవసర ఒత్తిడికిలోనై గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకుంటున్న భారత్‌కు డిఫెన్సే సవాలుగా మారింది.
బిరేంద్ర లక్రా, సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్‌సింగ్‌తో ఉన్న డిఫెన్స్ ఆందోళన కలిగిస్తోంది. బెల్జియంతో గత మ్యాచ్‌లో ఆఖర్లో గోల్ సమర్పించుకోవడంతో డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు గాయం నుంచి తేరుకుని ఇటీవలే జట్టులోకొచ్చిన సీనియర్ గోల్‌కీపర్ శ్రీజేష్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.
మరోవైపు కెనడా జట్టు ఇటీవలి కాలంలో బాగా మెరుగైంది. డిఫెన్స్ ఆ జట్టు అద్భుతంగా ఉంది. తమ తొలి మ్యాచ్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బెల్జియంను 1-2తో నిలువరించింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెనడా ఓడినప్పటికీ ఆ జట్టు ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. గతంతో పోలిస్తే కెనడా ఆటతీరులో భారీ మార్పు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాను తక్కువ అంచనా వేయద్దన్న తలంపుతో భారత్ ఉంది.
షెడ్యూల్:
Belgium vs South Africa, 5pm
India vs Canada, 7pm
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్-1లో ప్రత్యక్ష ప్రసారం